రైతుల నోట్లో మట్టికొడితే ఖబడ్దార్

Published: Thursday April 21, 2022
గంగ్యాడ రైతు భానూరి ఉపేందర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 20 ఏప్రిల్ ప్రజాపాలన : రైతుల నోట్లో మట్టికొట్టి గంగ్యాడ గ్రామ మూసి వాగుపై చెక్ డ్యాం నిర్మించడం సమంజసం కాదని గంగ్యాడ రైతు భానూరి ఉపేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నవాబ్ పేట్ మండల పరిధిలోని గంగ్యాడ గ్రామ రైతులు మూసి వాగుపై చెక్ డ్యాం నిర్మాణ పనులు నిలపాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగ్యాడ మూసి వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి వచ్చిన కాంట్రాక్టర్ లు రాజీ రెడ్డి, శివారెడ్డిలను అడ్డుకొని నిరసన తెలిపారు. అధికారుల తీరు స్థానిక ప్రజా ప్రతినిధుల తీరు ఏమాత్రం బాగా లేదని విమర్శించారు. రైతులు ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులు నోటి దురు సుతో మాట్లాడటం భావ్యం కాదన్నారు. రైతులకు ఉపయోగం లేని చెక్ డ్యామ్ వద్దు అని మొత్తుకుంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను బలి చేయడం ఏమిటని ప్రశ్నించారు. మాకు చెక్ డ్యామ్ వద్దే వద్దు అని రైతులందరూ ముక్త కంఠంతో తెలిపారు. నిరసన తెలిపిన వారిలో రైతులు పట్నం శేఖర్, ఉరకుర్వ అంజయ్య, శాపురం శ్రీనివాస్, సంకేపల్లి శేఖర్, మాసని గూడ రాజు, షాపురం పరమేశ్వర్, పసికె నాగర్జున రెడ్డి, అనంత్ రెడ్డి, పెద్ద వెంకట్ రామ్ రెడ్డి, సత్తి రెడ్డి, అంజయ్య, లక్ష్మి నారాయణ రెడ్డి, లింగయ్య, జంగయ్య, వెంకటయ్య, నర్సింలు, అంజయ్య, మహిళ రైతులు పాల్గొన్నారు.