దేవరుప్పల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు టీకాలు

Published: Thursday January 06, 2022
హైదరాబాద్ 4 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: కోవిడ్ మహమ్మారి బారినుండి పిల్లలను కాపాడడానికి ముందస్తు జాగ్రత్తలు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి (అంటే 2007వ సంవత్సరం లేదా అంతకు ముందు జన్మించిన వారు) ముమ్మరంగా కరోనా టీకా వేయడం జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జనగాం జిల్లా దేవరుప్పల మండల పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు దాదాపు 1880 వరకు ఉన్నారని అంచనా. నేటికీ 100 టీకాలను అర్హత గల పిల్లలకు వేయడం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 3వ తేదీ నుండి ప్రారంభించామని దేవరుప్పల వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తాల్క తెలియజేశారు. తల్లిదండ్రులు శ్రద్ద తీసుకొని అర్హత గల పిల్లలకు ముందు జాగ్రత్తగా ఈ టీకాను తప్పకుండా వేయించాలని సూచించారు. స్థానిక సర్పంచ్ లు, యంపిటిసిలు, యంపిపిలు, జడ్పిటిసిలు, నాయకులు మరియు ఉపాద్యాయులు అర్హత గల పిల్లలకు టీకాలు వేయించుకునే విధంగా చూడాలన్నారు. ప్రతి సమావేశంలోను జిల్లా పరిషత్ పాఠశాల మరియు కళాశాలల్లో  ఉపాధ్యాయులు లెక్చరర్ లు కరోనా టీకా విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని  మండల వైద్యాధికారి డాక్టరు కిషోర్ తాల్క ఈ సందర్భంగా  కోరారు. టీకా నియమ నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయని వైద్య అధికారి తెలిపారు. 15-18 సంవత్సరాల వయస్సు వారికి కోవిడ్ వాక్సినేషన్ సూచనలు: 2007లో లేదా అంతకు ముందు జన్మించినవారు ఈ వేసుకోవడానికి అర్హులు. జనవరి 3, 2022 నుండి ఈ టీకా కార్యక్రమం ప్రారంభం అయినదన్నారు. ఈ వయసు పిల్లలకు కోవాక్సిన్ టీకా మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవరుప్పలలో మాత్రమే 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ సెషన్స్ వేరుగా నిర్వహించ బడుతుందని తెలిపారు. ఆధార్ లేదా విద్యార్థి గుర్తింపు కార్డ్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. టీకా వేసిన తర్వాత దాదాపు అర గంట అక్కడే  వేచి ఉండాలన్నారు. మొదటి డోసు టీకా వేసుకున్న తర్వాత 2వ డోస్ టీకా 28 రోజుల తర్వాత తీసుకోవాలన్నారు. ఏ కారణం చేతనైనా టైఫాయిడ్ తదితర వాక్సిన్ లు తీసుకున్న వారు ఆ తేదీ నుండి 4 వారాల తర్వాత ఈ టీకా తీసుకోవాల్సిందిగా సూచించారు. కోవిడ్ వ్యాధి వచ్చి తగ్గిన వారు 3 నెలల తరువాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు అని దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తాల్క తెలియజేశారు. ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో మండలం లో అర్హత గల పిల్లలకు టీకా సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని దేవరుప్పల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి తెలిపారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్ర పరచు కోవడం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని అని అన్నారు. ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉంటుందని డాక్టర్ సలహా ఇచ్చారు.