వీఆర్ఏల హామీలపై సర్కార్ కు చిత్తశుద్ధి లేదా బతుకులు మారతాయని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం

Published: Tuesday August 02, 2022

బోనకల్, ఆగస్టు01 ప్రజా పాలన ప్రతినిధి: రెవిన్యూ వ్యవస్థలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా పనిచేస్తున్న వీఆర్ఏల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటు వీఆర్ఏల సంఘం ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పడినప్పటి నుండి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీఆర్ఏలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదని, చట్టబద్ధహక్కులు సృష్టించాలని పాలకులకు ఏమాత్రం లేదని వారు అన్నారు.వీఆర్ఏలకు పే స్కేల్ వారసులకు ఉద్యోగాలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించి రెండేళ్లు కావస్తున్న, నేటికీ హామీలు నెరవేరలేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేకసార్లు రెవెన్యూ ఉన్నత అధికారులకు వీఆర్ఏలు దరఖాస్తు ఇచ్చిన ఉపయోగం లేకుండా పోయిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అనేక ఆందోళన చేసిన ఫలితం లేకపోవడంతో వీఆర్ఏలు సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23వేల మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారని వీరిలో రిక్రూట్మెంట్ ద్వారా 3వేల మంది నియమితులు కాగా వారిలో 50 శాతం మహిళలు దివ్యాంగులు ఉన్నారని, 2020 సెప్టెంబర్ 9న శాసనసభలో రెవిన్యూ నూతన చట్టాన్ని ప్రతిపాదిస్తూ సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారని నేటికీ ఆ హామీలు అమలు కాకపోవడంతో వీఆర్ఏలు చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నారని అన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వీఆర్ఏలను కొనసాగిస్తామని శాసనసభలో ప్రకటించినారు. వారిలో ఎక్కువమంది వెనుకబడిన దళిత వర్గాల వారు ఉన్నారని, వారికి న్యాయం చేసి వారందరికీ పే స్కేల్ ఇస్తామని, వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పిస్తానని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. బతుకులు మారుతాయని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని ఆశించిన వీఆర్ఏలకు నిరాశ మిగిలిందని వారు ఆవేదన చెందుతున్నారు. వీఆర్ఏలకు కూడా పి ఆర్ సి వర్తింప చేస్తానని హామీ ఇచ్చారు కానీ పిఆర్సి జీవో ఇంతవరకు అమలు కాలేదని, రెండుసార్లు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే మేము ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు. పే స్కేల్ జీవో ఇచ్చి ఉంటే ప్రస్తుతం వస్తున్న నెల జీతం 10,500 రూపాయలకు బదులు నెలకు 25 వేల రూపాయలు వచ్చి ఉండేవని , ఈ రెండేళ్లలో నిత్యవసర వస్తువుల ధరలు బాగా పెరిగి వచ్చిన తక్కువ వేతనం జీతం సరిపోక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని, జీతాలు పెరుగుతాయని నమ్మి వడ్డీలకు అప్పులు తెచ్చి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు మండిపడ్డారు. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్న రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయినదని, ఉన్న సిబ్బందిపై పని భారం పెంచి వీఆర్ఏలు వివిధ సమస్యలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికైనా సీఎం స్పందించి వారి డిమాండ్లు నెరవేర్చాలని ప్రాధేయ పడుతున్నారు.