రామచంద్రపురం, పటాన్చెరులో థీమ్ పార్కులు

Published: Friday May 28, 2021

రామచంద్రాపురం, ప్రజాపాలన ప్రతినిధి : విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో  ఉద్యానవనాల ఏర్పాటుకి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, ఇందులో భాగంగానే పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్లలో థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు తెలిపారు. గురువారం రోజు రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీ లో కోటి నలబై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన థీమ్ పార్కు పనులకు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ తో కలిసి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాగ్యనగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పంలో భాగంగా పచ్చదనానికి పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు. ఇప్పటికే పటాన్చెరు పట్టణంలో మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గాంధీ థీమ్ పార్కు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రామచంద్రపురంలో పార్క్ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టినప్పుడే వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతామని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. థీమ్ పార్కుల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బల్దియా మేయర్ విజయలక్ష్మి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రమోద్ గౌడ్, బల్దియా  అధికారులు  నీరజ, సత్యనారాయణ, వెంకట రమణ, కాలనీ వాసులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.