క్రీడా ప్రాంగణాల స్థలాలను త్వరగా గుర్తించాలి

Published: Friday July 01, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూన్ 30 ప్రజా పాలన :  తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు వెంటనే స్థలాలను గుర్తించి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మద్గుల్ చిట్టంపల్లి లోని డిపిఆర్ సి భవనములో తెలంగాణకు హరితహారం, క్రీడా ప్రాంగణాలు, దళిత బంధు కార్యక్రమాల పురోగతిపై మండల స్థాయి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఇప్పటి వరకు స్థలాలు గుర్తించని గ్రామాలలో తాసిల్దారులు,  ఎంపీడీవోలు సమిష్టిగా కలిసి స్థల  కేటాయింపులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.  జిల్లాలో గ్రామపంచాయతీలు అనుబంద గ్రామాలకు సంబంధించి 715 క్రీడా ప్రాంగణాలకు గాను 574 క్రీడా ప్రాంగణాలకు స్థలలను గుర్తించి 36 క్రీడా ప్రాంగణాలను పూర్తి చేసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  మిగతా 141 క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించి జూలై 10 వ తేదీ లోపు పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు అవసరం మేరకు  స్థలం అందుబాటులో లేకున్నా 20 గుంటల భూమి ఉన్నప్పటికీ క్రీడా ప్రాంగణాలకు ఆ స్థలం కేటాయించి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో స్థలలు లేనట్లయితే శివార్ ప్రాంతంలో స్థలాలను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. ఐదు లక్షల కన్న తక్కువ ఆదాయం ఉన్న గ్రామపంచాయతీలలో క్రీడా ప్రాంగణాలకు సంబంధించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
హరిత హారంలో 10% గ్రీన్ బడ్జెట్ ను ఖచ్చితంగా ఖర్చు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కలెక్టర్ తెలిపారు.  ప్రతి గ్రామ పంచాయతీలో అంతర్గత రోడ్లకు ఇరువైపులా, పెద్ద సైజు మొక్కలు
 నాటాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన రహదారుల నుండి గ్రామాల అనుసంధాన రోడ్లకు ఇరువైపుల కూడా పెద్ద పెద్ద చెట్లను నాటేందుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా చెట్ల సంరక్షణకు ముళ్ళకంపలతో ఫెన్సింగ్ చేయాలన్నారు.  హరితహారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. హరితహారం ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
  దళిత బంధు లబ్ధిదారులకు ఇబ్బంది కలుగకుండ అన్ని విభాగాల్లో గ్రౌండింగ్  పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  గ్రౌండ్ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ సంబంధించి ఎంపీడీవోలు తమ సిబ్బందితో పూర్తి చేయించాలని కలెక్టర్ సూచించారు. వివిధ  విభాగాలకు సంబంధించి డి ఆర్ డి ఓ,  జెడ్పీ సీఈవో , వ్యవసాయ , ఇండస్ట్రీస్ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ  గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన ఆదర్శ గ్రామాలను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో తప్పనిసరిగా అవెన్యూ ప్లాంటేషన్ జరగాలని, ప్లాంటేషన్ కూడా నిండుగా, దట్టంగా , అతి దగ్గరలో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపైకి నీరు రాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో డి ఆర్ డి వో కృష్ణన్ , జెడ్పి సీఈఓ జానకి రెడ్డి, డి పి ఓ మల్లారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్ తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area