విద్యార్థి దశలోనే అగ్నిప్రమాదాలపై అవగాహన ఉండాలి

Published: Thursday April 21, 2022
వికారాబాద్ అగ్నిమాపక కేంద్ర అధికారి ఎన్.వెంకటరమణారెడ్డి
వికారాబాద్ బ్యూరో 20 ఏప్రిల్ ప్రజాపాలన : విద్యార్థి దశలోనే అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ అగ్నిమాపక కేంద్ర అధికారి ఎన్.వెంకటరమణా రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు రోజు సందర్భంగా జిల్లా కేంద్రములోని వికారాబాద్ అగ్నిమాపక కేంద్రంలో వివిధ అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు నివారించాలంటే విద్యార్థి దశలోనే వివిధ అగ్ని ప్రమాదాలపై చైతన్యం తీసుకునిరావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. మొట్ట మొదటిసారిగా వివిధ అగ్ని ప్రమాదాలపై కేంద్ర పరిధిలోని పాఠశాలల్లో చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన, పోటీలను నిర్వహించబడిందని గుర్తు చేశారు. అగ్నితో పోరాడే వాడే నిజమైన నాయకుడు అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించామని స్పష్టం చేశారు. అగ్నిని గౌరవించిన వారే దానికి స్నేహితుడని కొనియాడారు. అగ్నిని ఉపేక్షిస్తే లేదా నిర్లక్ష్యం చేస్తే శత్రువు కంటే తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించారు. వ్యాసరచన పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశామని వెల్లడించారు. నివాస గృహాలలోని వంట గదిలో ఎల్పిజి గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మరియ మండుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా వివరించారు. వాణిజ్య సముదాయాలలో అగ్ని ప్రమాదం జరిగి పొగలో చిక్కుకున్నప్పుడు విషపూరితమైన వాయువుని పీల్చుకోకుండా బయటకు ఎలా రావాలో వివరణ ప్రశంసనీయం. వివిధ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాలను నివారించే అగ్నిమాపక పరికరాల గురించి వివరించారు. అగ్నిమాపక శాఖ అగ్నిప్రమాద సమయంలోనే కాకుండా వరదలు, రైలు ప్రమాదాలు, భూకంపాలు, వంటి ప్రకృతి వైపరీత్యాల, సమయంలో కూడా ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడానికి అగ్నిమాపక సేవల శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా  ఖజానా అధికారి దశరథ్, జిల్లా సహాయ ఖజానా అధికారి వెంకటరమణ, అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటరమణ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు.