వన్యప్రాణుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Saturday January 21, 2023
మంచిర్యాల బ్యూరో, జనవరి 20, ప్రజాపాలన :
 
అడవులు, సరస్సులు, నదులు, సహజ సంపద, పచ్చదనంతో కూడిన పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జంతు హింస నివారణ సంఘం వారు రూపొందించిన కరపత్రాలను జిల్లా పశు సంవర్ధశాఖ సంయుక్త సంచాలకులు రమేష్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిలో మానవాళితో పాటు అడవులు, సరస్సులు, నదులు, పర్యావరణం, వన్యప్రాణులు, జీవజాలం సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ, వన్యప్రాణి, జంతు హింస నివారణ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. జంతువులు, పక్షులు, జలచరాలకు హాని కలిగించరాదని, జంతువుల సంరక్షణ కొరకు భారత ప్రభుత్వం జాతీయ జంతు సంక్షేమ మండలిని స్థాపించడం జరిగిందని, ఈ మండలి నిబంధనల మేరకు ఎవరైనా జంతు హింసకు పాల్పడినా, వాటి ఆవాసాలను ధ్వంసం చేసినా శిక్షార్హులు అవుతారని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో సంచరించే జంతువుల పట్ల కరుణతో వ్యవహరించాలని, పెంపుడు జంతువులకు సమయానుసారంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, పశువులు, జంతువులు, పక్షుల రవాణా సమయంలో జంతు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.