మహిళా టెక్నికల్ శిక్షణా కోర్సులలో బాలికల నుండి దరఖాస్తుల ఆహ్వానం : జిల్లా సంక్షేమ అధికారి ఉమ

Published: Friday August 20, 2021
మంచిర్యల బ్యూరో, ఆగస్టు 19, ప్రజాపాలన : శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళ టెక్నికల్ శిక్షణా సంస్థ (ఎస్ డిడిడబ్ల్యూటిటిఐ) హైదరాబాద్ నందు పాలిటెక్నిక్ కోర్సులలో 2020-21 విద్యాసంవత్సరానికి గాను తల్లిదండ్రులు కోల్పోయిన (అనాధ బాలికలు, తల్లి / తండ్రి కోల్పోయిన బాలికల నుండి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఉమాదేవి గురువారం  ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర కోర్సులు ఉన్నాయని, ప్రతి కోర్సులో 60 చొప్పున మొత్తం 240 సీట్లలో 70 శాతం తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన నిరుపేద బాలికలకు కేటాయించడం జరుగు తుందని, పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, 3 శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు (అనాధ బాలికలకు అవసరం లేదు), తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రములు, బోనాఫైడ్తో పాటు సంబంధిత ధృవపత్రాలను దరఖాస్తు ఫారమునకు జతచేసి జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈ నెల 23వ తేదీ లోగా అందజేయాలని, ఎంపికైన బాలికలకు ఉచిత విద్య, వసతి కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.