అర్హులైన రైతులు ఈ కేవైసీని సమర్పించాలి

Published: Friday May 27, 2022
కోటమర్పల్లి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య
వికారాబాద్ బ్యూరో 26 మే ప్రజా పాలన : అర్హులైన ప్రతి రైతు ఈ కేవైసీని నమోదు చేసుకోవాలని కోటమర్పల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య సూచించారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏఈఓ నీరజ ఆధ్వర్యంలో అర్హులైన రైతుల ఈ కేవైసీ ని నమోదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన ప్రతి రైతు ఈ కేవైసీని నమోదు చేసుకోవాలని హితవు పలికారు. ఓటీపీ ధ్రువీకరణ ద్వారా చేపట్టే ఆధార్ ఆధారిత ఈ కేవైసీ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసిందని గుర్తు చేశారు. అర్హులైన రైతులు సిఎస్ సి ( కామన్ సర్వీస్ సెంటర్ ) కేంద్రాలకు వెళ్లి కచ్చితంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేపట్టాలని వెల్లడించారు. పీఎం కిసాన్ నమోదు రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి అనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్ లో వెల్లడించిందని వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పదకొండవ వాయిదా పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీం అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని తెలిపారు. నేరుగా అర్హులైన రైతుల అకౌంట్లో ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం 3 వాయిదాలలో రెండు వేల చొప్పున జమ చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ జైహింద్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తహసిన్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకుడు రమేష్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.