నేటి భారత్ బంద్ ను విజయవంతం చేయాలి

Published: Monday September 27, 2021
మోదీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టడానికి ఏకంకావాలి.
అఖిలపక్షం సమావేశంలో నేతలు.
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 26, ప్రజాపాలన : నేటి భారత్ బంద్ ను విజయవంతం చేయాలని, మోదీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టడానికి ప్రతిపక్షాలు ఏకంకావాలని అఖిలపక్షం సమావేశంలో నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం భారత్‌ బంద్‌ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నివాసంలో వామపక్ష పార్టీ నేతలతో కలిసి అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి చేసేలా, అప్రజాస్వామిక విధానంలో మోదీ పాలన కొనసాగుతోందని అన్నారు. మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాల్ని వ్యతిరేకిస్తూ, మోదీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 27 తలపెట్టిన భారత్‌ బంద్‌ చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని వారు అన్నారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనకు ఊతమివ్వడానికి భారత్ బంద్‌ ను విజయవంతం చేయాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం కేవలం ఆధాని, అంబానీల కోసం పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వ కంపెనీలను నిర్వీర్యం చేసి ఆర్థిక దోపిడీకి పాల్పడుతుందని అన్నారు. రేపు జరగబోయే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞాపి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ నాయకులు పాల్గొన్నారు.