గ్రామాల పరిశుభ్రత పచ్చదనమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Wednesday July 28, 2021
వికారాబాద్ బ్యూరో 27 జూలై ప్రజాపాలన : గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచుకొనేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సూచించారు. మంగళవారం కొడంగల్ మండలంలోని ప్యాలమద్ది గ్రామాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హరితహారం నర్సరీని, వైకుంఠదామం, డంపింగ్ యార్డ్, పారిశుధ్యం, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి రోజు పారిశుధ్య పనులు చేపట్టి మురుగు నీరు రోడ్లపై నిలువకుండ చూడాలన్నారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వినియోగించాలని బహిరంగ మల విసర్జన చేయరాదని, ఇప్పటి వరకు మరుగుదొడ్లు నిర్మించుకొని వారు వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలో నిరూపయోగంగా ఉన్న పాత బావుల వలన ప్రమాదాలు జరుగకుండ ఇనుప జాలీలు అమర్చాలని సూచించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అవసరమైన కిటికీలు, తలుపులకు మరమ్మత్తులు చేయిస్తానన్నారు. వైకుంఠదామం, డంపింగ్ యార్డులను పరిశీలించి మిగిలివున్న చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తెవాలన్నారు. అంతకుముందు గ్రామంలో హరితహారం నర్సరీని సందర్శించి నర్సరీలోలో నిర్వహిస్తున్న పనులను స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. హరితహారంలో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున పంపిణీ చేసిన వివరాలను గ్రామ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కృష్ణన్, డిపిఓ రిజ్వానా, గ్రామ సర్పంచ్ జుబేదా, ఉప సర్పంచ్ నర్సప్ప, గ్రామ కార్యదర్శి శంకర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.