అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలి సీఐటీయూ డిమాండ్

Published: Friday November 26, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 25 ప్రజా పాలన ప్రతినిధి : అంగన్వాడి కేంద్రాల విలీన కార్యక్రమాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్& హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజ్యలక్ష్మి, సి ఐ టి యు జిల్లా నాయకులు పొచమోని కృష్ణ డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల విలీన కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇబ్రహీంపట్నం ఐ సి డి ఎస్ ప్రాజెక్టు సి డి పి వో ఆఫీస్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐ సి డి ఎస్ బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకోవాలని చూస్తుందని అన్నారు. ఇందులో భాగంగా 14000 అంగన్వాడి కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. దీనివలన అద్దె భవనాలతో 40 కోట్ల ఆదాయం ప్రభుత్వం పై పడకుండా ఉంటుందని చెబుతోంది. ఈ భారం తప్పించుకోవడానికి కారణం చెప్తుంది కానీ ఇది నిజం కాదని అన్నారు. అద్దె భవనాలు కారణం చూపి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి చూస్తుంది అని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం తో ఐ సి డి ఎస్ ని నిర్వీర్యం చేయడమే తప్ప మరొకటి కాదని అన్నారు. దీంతో అంగన్వాడి ఉద్యోగులతో పాటు ప్రజలందరికీ నష్టం కలిగించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలీన కార్యక్రమాన్ని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ యూనియన్ హెల్పర్స్ యూనియన్ సి ఐ టి యు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. కార్యక్రమాన్ని ఆపే అంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఐసిడిఎస్ ను యధావిధిగా కొనసాగిస్తూ పెంచిన పిఆర్సి ప్రకారంగా వేతనాలు పెంచాలని, సూపర్వైజర్ ఎగ్జామ్స్ తేదీని ప్రకటించాలని, పెండింగ్ టిఎ డిఎ, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 20న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు వై దేవి, వాణిశ్రీ, బాలమణి, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.