విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించాలి

Published: Tuesday August 31, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ బ్యూరో 30 ఆగస్ట్ ప్రజాపాలన : చాలా రోజుల తరువాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సూచించారు. సోమవారం బంటారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 16 నెలల తరువాత పాఠశాలలు తిరిగి తెర్చుకుంటున్నాయని పేర్కొన్నారు. చెత్త, చెదారం లేకుండా క్లాస్ రూమ్ లను, పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యుత్ సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు పై ఏర్పాట్లు అన్ని సక్రమంగా చేయాలన్నారు. మండలంలో మరో రెండు పాఠశాలలకు మిషన్ భగీరథ నీటి వసతి లేదని తెలుపగా, సంబంధిత అధికారిని రెండు రోజులలో నీటి వసతి కల్పించాలని ఆదేశించారు.  మోడల్ స్కూల్ కు కిచెన్ షెడ్ మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్బంగా ప్రకటించారు.  మండలంలో మరే పాఠశాలకైనా కిచెన్ షెడ్, మరుగుదొడ్లు అవసరమైతే వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. మోడల్ స్కూల్లో విరిగిపోయిన టాయిలెట్ తలుపులను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలనీ సూచించారు. రేపటి ప్రభుత్వ సెలవును వినియోగించుకోకుండా మిగిలిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం ఉండాలని కోరారు. పాఠశాలలు తెరుచుకున్న తరువాత విద్యార్థులు సామజిక దూరం, కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.  విద్యార్థులలో ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే ఉపాధ్యాయులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం బంటారం ప్రధాన రహదారికి ఇరువైపుల రెండు వరసల్లో హరితహారం క్రింద ఎవెన్యూ ప్లాంటేషన్లో పాల్గొని మొక్కలు నాటారు.  ఈ సందర్బంగా మొత్తం 1500 మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో పశువులకు నిర్వహిస్తున్న బ్రూసెల్లా వాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. దాదాపు 3000 పశువులకు వాక్సినేషన్ చేస్తున్నట్లు సంబంధించిన డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలయ్య, ఎంఇఓ చంద్రప్ప, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సరళ, మిషన్ భగీరథ ఇ ఇ వేణుమాధవ్, అడిషనల్ డిఆర్డిఓ స్టీవెన్ నీల్, పశు వైద్య శాఖ ఏడి సదానందం, డాక్టర్ కుమారస్వామి సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, ఎంపీపీ ప్రభాకర్, అధికారులు, ఉపాధ్యాయులు లు తదితరులు పాల్గొన్నారు.