పంటలు తడిసే వరకు సాగర్ నీటిని ఇవ్వాలి: సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆళ్ళపాడు మేజర్ ను 200 మంది

Published: Tuesday February 21, 2023
బోనకల్, ఫిబ్రవరి 20 ప్రజాపాలన ప్రతినిధి:
ఆళ్ళపాడు మేజర్ కింద ఎండిపోతున్న మొక్కజొన్న పంటకు పూర్తి స్థాయిలో సాగర్ నీటిని అందించి పంటలను కాపాడాలని సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోనే ఆళ్ళపాడు మేజర్ ను సోమవారం సుమారు 200 మంది రైతులతో కలిసి మల్లు భట్టి విక్రమార్క సోమవారం పరిశీలించారు. అనంతరం అక్కడే నీటిపారుదల శాఖ ఈఈ రామకృష్ణ బోనకల్ డి ఈ పబ్బతి శ్రీనివాస్ తో సాగర్ నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఆళ్ళపాడు మేజర్ కింద సాగు చసిన మొక్కజొన్న పంట అన్నదాతలు తమ సమస్యను మల్లు భట్టి విక్రమార్క, ఈఈ రామకృష్ణకు వివరించారు. ఆళ్లపాడు మేజర్ కింద ఆళ్లపాడు, గోవిందాపురం ఏ, బోనకల్ తదితర గ్రామాల కింద 3,600ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేసినట్లు అన్నదాతల వారికి వివరించారు. ఆళ్ళపాడు మేజర్ కు సాగర నీరు సక్రమంగా విడుదల చేయకపోవడం వలన సాగుచేసిన మొక్కజొన్న పంట దాదాపు ఎండిపోవటానికి వచ్చిందని, ఒక్కొక్క ఎకరానికి సుమారు 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒక క్వింటా కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, ఆంధ్ర సరిహద్దులో ఆళ్ళపాడు మేజర్ ఉండటం వలన సరఫరా అవుతున్న నీరు మొత్తం ఎక్కువగా ఆంధ్ర తరలిపోతున్నాయని రైతులు వారికి వివరించారు. ఆళ్ళపాడు మేజర్ వద్ద వెంటనే రెగ్యులేటర్ నిర్మించాలని లేకపోతే ఆళ్ళపాడు మేజర్ కు సాగర్ నీరు వచ్చే పరిస్థితి లేదని రైతులు వారికి స్పష్టం చేశారు. పైగా ఆళ్ళపాడు మేజరు బోనకల్ బ్రాంచి కెనాల్ కు ఎగువ భాగంలో ఉండటం వలన సాగర్ నీరు ఎక్కటం లేదని దీనివలన పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు వారికి వివరించారు. రైతుల పంటలకు పూర్తిస్థాయిలో మొక్కజొన్న పంట తడిసే వరకు సరఫరా చేయాలని ఈ ఈ రామకృష్ణను మల్లు బట్టి విక్రమార్క కోరారు. రోజుకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే ఎనిమిది రోజులపాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని, ఒకవేళ నాలుగు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే 12 రోజులపాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని రామకృష్ణను కోరారు. ప్రస్తుతం బీబీసీకి బస్తాలు అడ్డుకట్ట వేసి నీటిని పెట్టుకోవాలని రైతులకు బట్టి సూచించారు. దీంతో రామకృష్ణ స్పందిస్తూ పంటలు తడిసే వరకు నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, టి పి సి సి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్ ,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బంధం నాగేశ్వరరావు ,జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, కలకోట సొసైటీ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, గోవిందపురం ఏ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, తోటకూర వెంకటేశ్వరరావు, మల్లాది లింగయ్య, అల్లిక ఆబ్బయ్య, పారా వెంకట మోహన్ రావు, కందుల పాపారావు, షేక్ ఫకీర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.