రాపల్లి ఉపాధి హామీ పథకంలో 'అవినీతి' బహిర్గతం రసాభాసగా ఉపాధి హామీ పథకం గ్రామసభ

Published: Friday July 22, 2022

బోనకల్ , జులై 21 ప్రజాపాలన ప్రతినిధి: ఉపాధి హామీ గ్రామ సభకు రాపల్లి గ్రామ సర్పంచ్ టిఆర్ఎస్ జిల్లా నాయకుడు మందడపు తిరుమలరావు తన అనుచరులతో ముందుగానే పట్టుడు కర్రలతో పథకం ప్రకారం వచ్చారు. పోలీసుల ఎదుటనే దాదాపు గంటపాటు కర్రలతో ఏనుగు రవి ఇంటిపై దాడులకు విఫల యత్నం చేశారు.  మండల పరిధిలోనే రాపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయము వద్ద ఉపాధి హామీ గ్రామసభ గురువారం  గ్రామ సర్పంచ్ మందడపు తిరుమలరావు అధ్యక్షతన జరిగింది. ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విమర్శలు ఉండటంతో గ్రామ సభలో తన ప్రత్యర్థి వర్గానికి చెందినవారు నిలదీస్తారని పసిగట్టిన సర్పంచ్ తిరుమలరావు పథకం ప్రకారం తన అనుచరులతో పట్టుడు కర్రలతో గ్రామ మహాసభకు రప్పించారు. తిరుమలరావు వర్గానికి చెందిన కొంతమంది పథకం ప్రకారమే తమ మోటారు సైకిళ్లకు కర్రలు కట్టుకొని గ్రామ సభకు వచ్చారు. మరికొందరు కర్రలు పట్టుకొని నేరుగా గ్రామ సభకు వచ్చారు.  వీరందరూ మామూలుగానే గ్రామ సభకు హాజరయ్యారు. కానీ తిరుమల రావు వర్గానికి చెందిన వారందరూ కర్రలు పట్టుకొని గ్రామ సభ చుట్టు, రోడ్డుపై పహరా కాచారు. గ్రామసభలో తనిఖీ బృందం ఉపాధి హామీ పథకంలో తనిఖీ వివరాలను ఒక్కొక్కటి చదువుతున్నారు. తనిఖీ బృందం సభ్యుల ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసిన సమయంలో రాతపూర్వకంగా తాము ఉపాధి హామీ పనులకు వెళ్లలేదని కొంతమంది రాసి సంతకం పెట్టి ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం బృందం సభ్యులు 14 మంది పేర్లు చదవగా అందులో  8 మంది అసలు తాము ఉపాధి పనులకు వెళ్లలేదని లిఖితపూర్వకంగా రాసిచ్చారని చదివారు. దీంతో నెమ్మది నెమ్మదిగా వివాదం రాసుకుంటూ వచ్చింది. గ్రామసభ వేదిక పైనే బ్రాహ్మణపల్లి సహకార సంఘ అధ్యక్షుడు రాపల్లి నివాసి ఏనుగు నాగేశ్వరరావు పేరు కూడా తనిఖీ బృందం సభ్యులు చదివారు. రెండు వారాలలో 12 రోజులు పనికి వచ్చినట్లు అతనికి బిల్లు కూడా చెల్లించినట్లు రికార్డులలో ఉందని, కానీ తాము నాగేశ్వరరావు వద్దకు వెళ్లి తనిఖీ చేయగా తాను అసలు ఉపాధి హామీ పనులకు వెళ్లలేదని చెప్పారని తనిఖీ బృందం సభ్యుడు చదివాడు. ఇదే విషయాన్ని ఏనుగు నాగేశ్వరరావు కూడా వేదిక పైనే తాను పనికి వెళ్లలేదని స్పష్టం చేశాడు. దీంతో తిరుమల రావు ప్రత్యర్థి వర్గం గట్టిగా నిలదీసింది. పనికిరాని వారి పేరుతో పనికి వచ్చినట్లు మాస్టర్ల వేచి డబ్బులు స్వాహా చేశారని ప్రత్యర్థ వర్గానికి చెందినవారు తనిఖీ బృందం సభ్యులను నిలదీశారు. ఇదే సమయంలో తిరుమల రావు ఓ మహిళను పిలిపించి తాను ఉపాధి హామీ పనికి వెళ్లినట్లు గ్రామ సభలో చెప్పించారు. అయితే ఈ మహిళ తనిఖీ బృందం సభ్యులకు తాను ఉపాధి పనులకు వెళ్లలేదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు బృందం సభ్యుడు తెలిపాడు. ఈ సమయంలో తిరుమల రావు తన అసహనాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇది పనికిరాని ప్రభుత్వమని ఆగ్రహంతో ఊగిపోతూ ఘాటుగా మాట్లాడారు. మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం తనిఖీ ఎందుకు చేయలేదని మూడు సంవత్సరాల క్రితం విషయాలు ఇప్పుడు ఎలా గుర్తు ఉంటాయని తీవ్ర అసహనంతో ఊగిపోయారు. ఒక్కొక్క అవినీతి బయటపడుతుండటంతో సహనం కోల్పోయిన తిరుమల రావు తన ఫోన్ ని వేదికపై గల బల్లపై బలంగా విసిరి వేశాడు. ఉపాధి హామీ పథకంలో ఒక్కొక్కటి అవినీతి బహిర్గతం అవుతుండటంతో తిరుమల్ రావు వర్గం అసహనం కోల్పోయి పట్టుడు కర్రలతో ప్రశ్నించిన ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై దాడులకు ప్రయత్నించారు. ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్న ఏనుగు రవి ఇంటిపై దాడి చేసేందుకు దాదాపు గంట పాటు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పట్టడు కర్లతో గ్రామసభ వద్ద, రోడ్డుపై స్వైర విహారం చేశారు. ఏఎస్ఐ కొండేటి వీరస్వామి కానిస్టేబుల్ రమేష్ బాబు ఎంత వారిస్తున్న ఆగకుండా కర్రలతో వారు దాడులు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు తిరుమల రావు గ్రామపంచాయతీ గోడదూకి ఏనుగు రవి ఇంటి పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో రవి వర్గం ఎదురు దాడికి ప్రయత్నించడంతో ఆగిపోయాడు. గ్రామసభ అదుపు తప్పటంతో గ్రామస్తులు వైరా ఏసిపి ఎంఏ రెహమాన్ కు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి హుటాహుటిన మరికొంత సిబ్బందిని రాపల్లి పంపించారు. వారు వచ్చే సమయానికి కూడా సర్పంచి వర్గానికి చెందినవారు కర్రలతో గ్రామసభ చుట్టూ కాపలా కాశారు. ఇదే సమయంలో రాష్ట్ర ఆడిటింగ్ ప్రోగ్రాం ఆఫీసర్.          ఏపీవో బసవొజు కృష్ణకుమారి, టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామ సభ వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర ఆడిటింగ్ ఆఫీసర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయమని కోరారు మరలా పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని ప్రతి వర్గానికి ఆయన హామీ ఇచ్చారు. చివరకు ఇరు వర్గాల వాదనలతో గ్రామసభ రసాభాసగా ముగిసింది. తనిఖీ బృందం సభ్యులు పూర్తిస్థాయిలో వివరాలు చదవకుండానే గ్రామసభ ముగించారు.