అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం

Published: Monday January 09, 2023
* మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 8 జనవరి ప్రజా పాలన : అసైన్డ్ భూములను క్రయ విక్రయాలను జరుపుకునేందుకు యాజమాన్య హక్కులను కల్పిస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి మాట్లాడుతూ భూమి హక్కు కలిగిన రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతుబంధు అందజేస్తామని తెలిపారు. వికారాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పనులు చేపట్టగా అధోగతి పాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం కారణంగానే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ నుండి జోగులాంబ జోనులోకి మార్చారన్నారు. ఎకరాకు 15000 చొప్పున రైతుబంధు అందిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు కూడా 15000 చొప్పున అందిస్తామని వెల్లడించారు. భూమిలేని నిరుపేదలకు 12 వేల చొప్పున అందిస్తామని వివరించారు. జిల్లాకు సాగు నీటి కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తే దాన్ని తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిందని విమర్శించారు. జిల్లాకు అన్యాయం చేయడం ఒకవైపు అయితే సంగారెడ్డిని చార్మినార్ జోన్ లో కలిపడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుండి వికారాబాద్ జిల్లాకు సాగు నీటి సౌకర్యం కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేకపోవడం దురదృష్టకరమని దెప్పి పొడిచారు. ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పనిచేసి రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టును వారి కమిషన్ కోసమే చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వేయడమే తప్ప ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిగి నియోజకవర్గంలోని జీడిగడ్డ తండా లోని 500 మందికి 300 కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయించిన నిధులను అడ్డుకున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చామల రఘుపతి రెడ్డి బ్లాక్ ఏ అధ్యక్షుడు అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కోటమర్పల్లి కృష్ణారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి, మర్పల్లి ఎంపిపి బట్టులలిత రమేష్, చాపల శ్రీనివాస్ ముదిరాజ్ వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.