పులుమద్ది గ్రామ రైతులు వర్సెస్ అటవీశాఖ అధికారులు

Published: Tuesday November 16, 2021
వికారాబాద్ బ్యూరో 15 నవంబర్ ప్రజాపాలన : రెవెన్యూ అటవీ శాఖ భూములకు సంబంధించి సమన్వయ లోపంతో రైతుల పొట్ట కొడుతున్నారని అరుణోదయ పార్టీ వ్యవస్థాపకురాలు విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు పులుమద్ది గ్రామ రైతులకు కొత్తపాసు పుస్తకాలు ఇప్పించాలని పులుమద్ది రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్ మండల పరిధిలోగల పులిమద్ది గ్రామంలో ప్రభుత్వ భూమి 200 ఎకరాలు ఉన్నదని పేర్కొన్నారు. 220 నుండి 253 వరకు గల సర్వే నెంబర్లలో సుమారు 200 ఎకరాల భూమి ఉన్నదని వివరించారు. 92 మంది పేద రైతులు గత 72 సంవత్సరాల నుండి సాగు చేసుకుని తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారని స్పష్టం చేశారు. 1950- 55 సంవత్సరాల పహాణిలో ప్రభుత్వ భూమి గానే రాసి ఉన్నదని గుర్తుచేశారు. 1985లో ఈ భూమి ఫారెస్ట్ అని పహాణిలో రాయడం అయోమయానికి గురి చేస్తోందన్నారు. ఫారెస్ట్ అని రాయడమే రైతుల పాలిట శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 72 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమి వద్దకు సంబంధిత అధికారులు రాకుండా నిజానిజాలు తెలుసుకోకుండా ఫారెస్ట్ భూమి అని గుడ్డిగా రాయడం క్షమించరాని తప్పు అని విమర్శించారు. గతంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన అలుగు వర్షిని ఈ విషయమై పరిశీలించి అధికారుల తప్పిదమే అని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. 72 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు మంజూరు చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారని చెప్పారు పులమద్ది గ్రామం భూమి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ భూములకు సంబంధించి చి అటవీ శాఖ మంత్రి జోగు రామన్న రైతులు జిల్లా అటవీ శాఖ అధికారులు మంత్రి నివాసంలో సమావేశమై సమస్య తీవ్రతను వివరించామని తెలిపారు. 2 జూన్ 2014 కంటే ముందు సాగు చేసుకుంటున్న అటవీ భూమి గానీ బంజరు భూమి గాని రైతులను ఇబ్బంది పెట్టవద్దని వాళ్ళ పై అక్రమ కేసులు నమోదు చేయరాదని ఒకవేళ కేసు నమోదు చేసి ఉంటే వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారని వివరించారు. 2 జూన్ 2014 తర్వాత అటవీ భూములు ఆక్రమించిన అట్టి విషయంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం కోఆర్డినేటర్ నాగిరెడ్డి జిల్లా అధ్యక్షులు ఏసురత్నం పోతుల రమేష్ లక్ష్మమ్మ రాములమ్మ సంతోషమ్మ సలీమా బేగం బి తదితర గ్రామ రైతులు పాల్గొన్నారు.