నేను వాక్సిన్ తీసుకున్న-మీరు తీసుకోండి

Published: Wednesday April 28, 2021
వికారాబాద్ ఏప్రిల్ 27 ప్రజా పాలన బ్యూరో : తెలంగాణలో అందరికి వాక్సినేషన్ ప్రక్రియ మే 1 నుండి ప్రారంభం అవుతున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, వైద్య సిబ్బందితో కలిసి సందర్శించిన మంత్రి సబితా రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను వాక్సిన్ తీసుకున్న-మీరు తీసుకోండని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలతో పాటు వలస కార్మికులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారికి కూడా ఉచిత వాక్సిన్ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. కరోనా లోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల క్షేమం కోసం కోవిడ్ కట్టడికి నిరంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితి ని సమీక్షిస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజాలంతా కోలుకోవాలన్నారు. వాక్సిన్ తోనే కరోనా చైన్ విడగొట్టడం సాధ్యమని ఆ దిశగా ప్రజలంతా ప్రభుత్వం తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ లో త్వరలో ఆర్ టి-పి సి ఆర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని వ్యక్తపరిచారు. వాక్సిన్ కు, కరోనా టెస్టులకు వచ్చే వారు దూర దూరంగా ఉండేలా చూడాలని, ఈ కేంద్రాలు కూడా ఒకే దగ్గర కాకుండా దూరంగా ఏర్పాటు చేయాలని సూచించారు.