దృఢ సంకల్పమే 5 కి.మీ. వాకింగ్ లో ద్వితీయ స్థానం * గోధంగూడ కలాల్ సత్తయ్య గౌడ్

Published: Wednesday February 22, 2023
వికారాబాద్ బ్యూరో 21 ఫిబ్రవరి ప్రజాపాలన :  దృఢ సంకల్పంతో పోటీలలో పాల్గొనుటకు వయస్సు అడ్డంకి కాదని గోధంగూడ గ్రామ నివాసి కళాల్ సత్తయ్య గౌడ్ అన్నారు. వయస్సు శరీర వృద్ధాప్యానికే గాని దృఢ సంకల్పానికి కాదని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో చరవాణిలో మాట్లాడుతూ
హరియాణ రాష్ట్రంలోని కురుక్షేత్రంలో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ 2023 చాంపియన్ షిప్ 5 కి.మీ. వాకింగ్ పోటీలలో ద్వితీయ స్థానం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి 60 సంవత్సరాల పైబడి వయసు గలవారు నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ 20 23 ఛాంపియన్ షిప్ లో 16 మంది పాల్గొన్నారని స్పష్టం చేశారు. 16 మందితో పోటీపడి ద్వితీయ స్థానం రావడానికి ప్రధాన కారణం ప్రతిరోజు వాకింగ్ చేయడమేనని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా శ్రమ చేయగలిగినప్పుడే ఆరోగ్యవంతులుగా తయారవుతారని ధీమా వ్యక్తం చేశారు. యువత యాంత్రిక జీవన విధానముతో పాటు శారీరక శ్రమ కూడా అత్యంత ఆవశ్యకమని గుర్తించాలన్నారు. శారీరకంగా శ్రమ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. నేటి యువత వ్యసనాలకు బానిసలు అవ్వకుండా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. 24 గంటలు సెల్ ఫోన్లు టీవీలకు అతుక్కపోకుండా బాహ్య ప్రపంచం వైపు యువత దృష్టి సారించాలని సూచించారు.