దాసారం బస్తీవాసులపై వరాల జల్లు కురిపించిన మంత్రి తలసాని ...

Published: Monday March 14, 2022
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : సనత్ నగర్ డివిజన్ లో అత్యంత పేద వర్గాలు నివసించే ప్రాంతంగా పేరున్న దాసారం బస్తీ అభివృద్ధి కోసం నడుం కట్టిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ దిశగా పలు కార్యక్రమాలు చేపడుతూ బస్తీ వాసుల కళ్ళల్లో ఆనందానికి కారణమవుతున్నారు. గత కొన్ని రోజుల ముందు ఇక్కడ పర్యటించిన ఆయన దాసారం బస్తీ ప్రజల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని ప్రకటించిన దరిమిలా, ఆదివారం ఆయన బస్తీ ప్రజలు ఏర్పాటు చేసిన సమావేశానికి వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్తీ ప్రతినిధులు మంత్రి దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. ప్రధానంగా ఇంటింటికి నల్లా కనెక్షన్, విద్యుత్ మీటర్లు కావాలని కోరగా, వెంటనే విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎలెక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ నివసించే వారంతా నిరుపేదలేనని, మీకు అన్నివేళలా అండగా ఉంటూ మీ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. బస్తీలో ఎన్నో రోజుల నుంచి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో పూర్తిస్థాయిలో చెత్తను ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు వివరించారు. చెత్త తరలింపు పూర్తయిన తర్వాత ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఫంక్షన్ ల కోసం ప్రయివేట్ ఫంక్షన్ హాల్స్ కు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ నామమాత్రపు ధరకే అద్దెకు లభిస్తుందని చెప్పారు. తమ పిల్లలకు ఎస్ ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా బోధన జరుగుతుందని, విద్యాబోధన కోసం ఒక షెడ్డు ను నిర్మించాలని మంత్రిని కోరగా, ఒక షెడ్డు తో పాటు విద్యార్థులకు ఫర్నిచర్, యూనిఫామ్ కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ వంశీ, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్, ఎలెక్ట్రికల్ ఎడి అమర్ నాధ్, స్ట్రీట్ లైట్ ఈఈ వెంకటేష్, హెల్త్ ఆఫీసర్ రవి, బస్తీ ప్రతినిధులు కృష్ణమూర్తి, విశ్వనాధ్, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.