అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం జయప్రదం చేయాలి

Published: Monday December 19, 2022
జన్నారం, డిసెంబర్ 18, ప్రజాపాలన:  అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం జయప్రదం చేయాలని ఆదివారం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాప అధ్యక్షులు కన్నడ భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా దుబాయ్ నుండి చరవాణి ద్వారా మాట్లాడుతూ మానవ వలస అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ప్రక్రియ వలసలకు, అభివృద్ధికి, మానవ వికాసానికి సంబంధం ఉన్నదని వలస వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే గా ప్రకటించిందన్నారు. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. ఈ సందర్భంగా ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం వలసలకు ఒక కారణంమని,  అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం మరొక కారణంమని, పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారన్నారు. ఒకదేశం నుండి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారని ఆయన తెలిపారు. కోవిడ్ పరిస్థితుల వలన గల్ఫ్ దేశాలలో 3,576 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో 200 కు పైగా తెలంగాణ వారు ఉన్నారన్నారు. కోవిడ్ సందర్బంగా గల్ఫ్ దేశాల నుండి భారత్ కు 'వందే భారత్ మిషన్' లో 7,16,662 మంది వాపస్ వచ్చారు. వీరిలో ఒక లక్షమంది తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా వేశామన్నారు. ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ రాబట్టుకోవడం కోసం జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్ అనే ఉద్యమం నడుస్తున్నదన్నారు. వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేసిందన్నారు. వలస కార్మికులు చెల్లించే సర్వీస్ చార్జీలు రూ. 30 వేలు దీనిపై 18 శాతం జీఎస్టీ మాత్రం తగ్గించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ ప్రవాసీ విధానం ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో 1500 కు పైగా తెలంగాణ ప్రవాసులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలు ఐదు రూపాయలు లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ఎదిరి చూస్తున్నారన్నారు. రూపాయలు 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చేయాలని కోరుతున్నామన్నారు. 
38 ఏళ్లనాటి ఎమిగ్రేషన్ యాక్టు, 1983 స్థానంలో నూతన ఎమిగ్రేషన్ యాక్టు, 2021 ను తీసుకరావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న 2,183 మంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఎదిరి చూస్తున్నారన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయి లో ఏర్పాటు చేసిన విధంగా విదేశ్ భవన్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సమీకృత సముదాయంలో పాసు పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసిసిఆర్ రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 'ప్రవాసీ తెలంగాణ దివస్' ను అధికారికంగా నిర్వహించాలి. విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి  సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన మాట నిలుపు నిలుపుకోవాలని మరియు ప్రవాసులు అందరికీ శుభం జరగాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య, దుబాయ్ శాఖ అధ్యక్షులు మొహమ్మద్ అలీమ్, రాష్ట కోశాధికారి అమరకొండ మల్లేష్,  బార్ దుబాయ్ కోఆర్డినేటర్ రమేష్, సింగసాని రమేష్, సభ్యులు సింగసాని సతీష్, దండ వేణి వినోద్, ముత్యం రాజు, కందుల మురళి, కందుల మొగిలి, తదితరులు పాల్గొన్నారు.