మూఢనమ్మకాలతో జీవితాన్ని పాడు చేసుకోవద్దు

Published: Friday May 20, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 19 మే ప్రజాపాలన : 
మూఢనమ్మకాలతో జీవితాన్ని పాడు చేసుకోవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పట్టణంలోని మా శారదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అశ్వినిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధారూర్ మండలం కుక్కింద గ్రామానికి చెందిన 18 సంవత్సరాల అశ్వినిని తల్లిదండ్రులు నస్కల్ లోని రఫీ అనే దొంగ బాబాను నమ్మి, మూఢనమ్మకంతో నిప్పుల పై రెండు కాళ్ళు, ఒక చెయ్యి పెట్టించడంతో తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. 
 అశ్విని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని, దీనికి కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గం, జిల్లాలో ఉన్న దొంగ బాబాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిఎం అండ్ హెచ్ఓ, పోలీసులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, డిఎం హెచ్ఓ తుకారాం, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.