అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం

Published: Saturday December 10, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 09, ప్రజాపాలన: అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దామనే నినాదంతో  సెంటర్ ఫర్ లీగల్ ఎయిడ్ అండ్ సోషల్ అవేర్నెస్,  క్లాస్ ( ఉచిత న్యాయ సహాయ అవగాహన కేంద్రం ) ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామకృష్ణపూర్ పట్టణంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా క్లాస్ డైరెక్టర్, అడ్వకేట్ మోతె రాజలింగు మాట్లాడుతూ  అవినీతి సమాజాభివృద్ధికి ఆటంకం అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, ప్రజల తలసరి ఆదాయం పెరగలేదన్నారు.దీనికి కారణం దేశంలో పాతుకుపోయిన అవినీతి వ్యవస్థ కారణమన్నారు. సంస్కరణలు పూర్తిస్థాయిలో అమలు అయినప్పుడే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఎవరో అవినీతి చేస్తే నాకేంటి? అనుకునే పట్టింపు లేని తనాన్ని  వదిలన్నారు. ప్రైవేటు ప్రయోజనాలకు ప్రజా వ్యవస్థలను, వనరులను, సంపదను, అధికారాన్ని, హోదాను ఏ రూపంలో వాడినా అవినీతేనని, దీన్ని అడ్డుకునే వ్యవస్థలు లేవన్నారు. ఈ అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.ఈ  కార్యక్రమంలో  గంధం బాబురావు,రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ నల్ల సత్యనారాయణ, కొత్తపల్లి ఓదెలు, చిప్పకుర్తి శంకర్, గొడిశెల తిరుపతి, పోశం  తదితరులు పాల్గొన్నారు.