పల్లెప్రపంచం జీనియస్ 2022 ఫైనల్ కు 35 మంది ఎంపిక

Published: Monday January 31, 2022
బోనకల్, జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి : పల్లెప్రపంచం జీనియస్ 2022 లో ఫైనల్ విభాగంలో 35 మంది ఎంపిక అయినట్లు పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షుడు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం చొప్పకట్లపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 16 న జరిగిన వ్రాత పరీక్ష లో 128 మంది పాల్గొన్నారని తెలిపారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులు కూడా ఎక్కువ మంది పాల్గొన్నారని అన్నారు. తల్లి తండ్రుల, ఉపాధ్యాయుల అభ్యర్ధన మేరకు ఫైనల్ రౌండ్ కు రెండు బ్యాచ్ లను ఎంపిక చేశారు. పదోతరగతి వరకు 15 మంది, ఆపైన వారిలో 20 మందిని ఎంపిక చేశారు. ఇందుకు సహృదయంతో అంగీకరించిన సీనియర్లు కు అభినందనలు తెలిపారు. ప్రైజ్ మనీ మొదట ప్రకటించిన ₹20,000 లను, ₹35,000లకు పెంచి సీనియర్లు కు ₹20,000, జూనియర్ లకు, ₹15,000 లు కేటాయించారు. తెలంగాణ పోరాట యోధుడు బొప్పాల సీతారామయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన మొదటి భాగం వ్రాత పరీక్ష లో సీనియర్ లలో బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన ఆవుల ఉపేందర్ రావు 76 మార్కులతోనూ, జూనియర్ లలో చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామానికి చెందిన మద్దినేని వేణు 60 మార్కులు సంపాదించి టాపర్లు గా నిలిచారు. ఫిబ్రవరిలో రెండో భాగం వ్యక్తి గత టాలెంట్ షో జరుగుతుందన్నారు. జీనియస్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన గోవిందా పురం (ఎల్) హైస్కూల్ టీచర్ పిల్లలమర్రి శివనాగేశ్వరరావు, ముష్టికుంట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చలపతిరావు, ప్రయివేట్ టీచర్ దారెల్లి మురళీ కృష్ణ, చలమల అజయ్ కుమార్, కొండేటి అప్పారావు లకు ధన్యావాదాలు తెలిపారు.