బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి : ప్రో.నునావత్ దేవదాస్

Published: Tuesday March 16, 2021

జగిత్యాల, మార్చ్ 15 (ప్రజాపాలన ప్రతినిధి): బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అఖిల భారతీయ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు ప్రో. నునావత్ దేవదాస్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొ. నాయక్ మాట్లాడుతూ ముఖ్యమైన రంగాలుగా చెప్పుకునే పబ్లిక్ సంస్థలు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా తదితర ప్రభుత్వ సంస్థలన్నిటిని ప్రైవేటు పరం చేసి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా దొడ్డిదారిన రిజర్వేషన్ తొలగించడానికి తీసుకున్న నిర్ణయంగా అఖిల భారతీయ గిరిజన సమాఖ్య తెలంగాణ రాష్ట్రం భావిస్తోందన్నారు. ఇదేవిధంగా బ్యాంకులను ప్రైవేటుపరం చేసి ప్రజల వద్ద నుండి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని మరియు ప్రజలకు ఎక్కువ వడ్డీ రుణాలు ఇచ్చి సామాన్య ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో రాకుండా సామాన్య ప్రజలకు ఆర్థికంగా నష్టాలు కలుగజేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం పూనుకుందని మరియు బ్యాంకులలో ఎస్సీ ఎస్టీ బిసి అభ్యర్థుల ఉద్యోగాలకు రిజర్వేషన్ తొలగించడానికి కుట్ర పన్నిందని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమానికి వారి ఆందోళనకు అఖిల భారతీయ గిరిజన సమాఖ్య పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.