అమాత్య.. అమీర్ పేట ఆసుపత్రిపై కరుణించయ్యా..

Published: Tuesday March 08, 2022
ఆసుపత్రి గొప్పగా ఉన్నా అందులో ఎక్విప్ మెంట్,ల్యాబ్ ఫెసిలిటీ, మందుల కొరత
మంత్రి తలసానికి మొర పెట్టుకుంటున్న అమీర్ పేట వాసులు
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత రద్దీ ప్రదేశం, అన్ని రకాల ప్రజలు కలిసి ఉండే ప్రదేశం, ఐటి కోచింగ్ సెంటర్ లకు నిలయమైన ప్రదేశం, ఎన్నో, ఎన్నెన్నో హాస్టల్ లు, అందులో కోచింగ్ తీసుకునే యువతతో ఎప్పుడూ కిటకిటలాడే ప్రదేశం అంటే ఠక్కున గుర్తొచ్చేది అమీర్ పేట. అటువంటి అమీర్ పేటలో స్థానిక ఎం ఎల్ ఏ గా గెలుపొంది మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా కొన్ని కొన్ని పనులు అసంపూర్తిగా జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అందులో ప్రధానంగా వినిపించేది అమీర్ పేట నడిబొడ్డున నిర్మించిన 50 పడకల ప్రభుత్వాసుపత్రి, దీనికి ఏం శాపం తగిలిందో ఏమో కానీ అన్ని పనుల్లో జాప్యమే. మొదట హాస్పిటల్ కట్టడానికే చాలా ఏళ్ళు పడితే హాస్పిటల్ కట్టాక అది ప్రారంభోత్సవం చేయడానికి మరి కొన్నేళ్ళు పట్టింది. తీరా ప్రారంభోత్సవం జరిగే రోజు అది ప్రారంభోత్సవంలా కాకుండా రెండు పార్టీల మధ్య గొడవలా తయారయ్యి ఎలాగోలా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇక ఇప్పుడు హాస్పిటల్ ప్రారంభమయ్యాక డాక్టర్ లు ఉన్నా కూడా సదుపాయాలు, ఎక్విప్ మెంట్ లేక హాస్పిటల్ ను ప్రజలు సంపూర్ణంగా ఉపయోగించుకోలేని పరిస్థితి. హాస్పిటల్ ప్రారంభమైన మొదట్లో ఇద్దరు, ముగ్గురు మాత్రమే క్లీనింగ్ సిబ్బంది ఉండగా ఈ మధ్యనే ఒక ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వగా మరికొంత మంది సిబ్బంది జత కలిశారు.ఇక ఇందులో పనిచేస్తున్న డాక్టర్ల విషయానికొస్తే మొత్తం 16 మంది పని చేస్తుండగా అందులో 10 మంది పర్మినెంట్ వారు ఉండగా వారిలో ఆరుగురు సివిల్ సర్జియన్ లు, ముగ్గురు రెగ్యులర్ వారు ఉన్నారు. మిగతా ఆరుగురు కాంట్రాక్టు లో పనిచేస్తున్న డాక్టర్లే. ఈ హాస్పిటల్ లో డెలివరీలు తప్ప, జనరల్ సర్జరీలు ఇప్పటికీ కూడా ప్రారంభం కాలేదు. ఇందుకు సిబ్బంది చెప్తున్న ప్రధాన కారణం ఎక్విప్ మెంట్ లేకపోవడమే. కనీసం ఫర్నిచర్ కూడా లేకపోవడం, చివరికి ఐవి సెట్ లు కూడా లేవని సిబ్బంది పేర్కొనడం కొసమెరుపు. ఇప్పటి వరకు నెలకు మూడు లక్షల నిధులు మాత్రమే ఉన్నా కూడా గత నెలలో 86 ఐపీ, 2600 ఓపి, 12 డెలివరీ లు(5 సిజేరియన్, 7 నార్మల్), 6 ఫోటో థెరపీ లు, 120 ఈసిజిలు చేసిన డాక్టర్ల ను నిజంగా అభినందించాల్సిందే. ఈ ఆసుపత్రిలో ఇంకా ల్యాబ్ సౌకర్యం ప్రారంభించలేదు. టి హబ్ కొరకు కొన్ని గదులు కేటాయించినా నేటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మందులకు బడ్జెట్ కేటాయించలేదు. పేషెంట్ లకు యాంటీబాటిక్ మందుల కొరత అధికంగా ఉండడంతో డాక్టర్లకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇక ఇన్ పేషెంట్ లకు భోజన వసతి ఇంకా ప్రారంభం కాకపోవడంతో బయటి నుంచే ఆహారం తీసుకుని రావాల్సిన స్థితి. ఇంత జరుగుతున్నా స్థానిక నాయకులు ఏం చేస్తున్నారని నిజంగా ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి. స్థానిక కార్పొరేటర్ బీజేపీ నుండి గెలుపొందిన ఆమె కావడం, గెలిచిన కార్పొరేటర్ కూడా శానిటేషన్ కార్యక్రమాలపై చూపిస్తున్న శ్రద్ధ డివిజన్ లోని ఆసుపత్రికి కావలసిన సౌకర్యాలపై పెట్టకపోవడం, ఓడిన అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ ప్రారంభోత్సవం నాడు, మళ్ళీ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పేషెంట్ లకు పండ్ల పంపిణీకి తప్ప ఈ ఆసుపత్రి వైపు చూసిన దాఖలాలు లేవని ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. ఈ ఆసుపత్రి విషయంలో మొదటి నుండి శ్రద్ధ కనపరిచింది ఒక్క మంత్రి తలసాని మాత్రమే అని, ఆయన వరకు ఈ సమస్యలన్నీ ఎవరూ తీసుకెళ్లక పోవడం వల్లే ఈ సమస్య అని ప్రజానీకం చర్చించుకుంటున్నారు. అందుకే మంత్రే చొరవ తీసుకుని ఈ ఆసుపత్రికి కావలసిన ఎక్విప్ మెంట్ను, మందులను, ల్యాబ్ సౌకర్యం వంటివి ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఆసుపత్రి ఇంత గొప్పగా కట్టినా, అంతమంది డాక్టర్లు పనిచేస్తున్నా డివిజన్ ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రి అందుబాటులోకి రాలేదన్నది మాత్రం వాస్తవం. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం.