సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Thursday July 29, 2021
అమీన్పూర్, జూలై 28, ప్రజాపాలన ప్రతినిధి : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో అమీన్పూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 230 నూతన రేషన్ కార్డులు, 53 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్  ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుదన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడనే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ దేవానందం, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, తహశీల్దార్ విజయ్ కుమార్, ఎంపిటిసిలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, లబ్ధిదారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.