హరితహారంలో నిర్లక్ష్యం చేయరాదు

Published: Wednesday April 27, 2022
ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్
వికారాబాద్ బ్యూరో 26 ఏప్రిల్ ప్రజాపాలన : వచ్చే హరితహారంలో డ్రై వికారాబాద్ ను గ్రీన్ వికారాబాద్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం 2022-23 సంవత్సరానికి గాను హరితహారంలో జిల్లాలో చేపట్టాల్సిన పనులపై ఓ.ఎస్.డి (హరితహారం) జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ రాష్త్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాధాన్యత ఇచ్చే హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం వహించకుండా ప్రతి గ్రామ్మాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లాలో జూన్ మాసంలో చేపట్టే హరితహారం కార్యక్రమంలో జిల్లా సరిహద్దు మొదలుకొని రోడ్లకు ఇరువైపులా పెద్ద మొత్తంలో  మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాల్లాన్నారు. ఆర్ & బి రోడ్ల మొదలుకొని గ్రామాలకు వెళ్లే అనుసంధాన రోడ్లకు ఇరువైపులా స్థలాలను దృష్టిలో పెట్టుకొని అవసరమున్న ప్రదేశాల్లో రెండు వరుసలు వచ్చేలా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటేందుకు వీలుగా ఎన్ని మొక్కలు అవసరపడుతాయో అంచనాలను తయారుచేసి నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు. మొక్కలు సరిపోని పక్షంలో హెచ్ఎండిఎ నుండి అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. రోడ్లకు ఇరువైపుల గుల్మొహర్, టేకమా, పగోడా,  బాబునియ వంటి మొక్కలను నాటాలని సూచించారు. జిల్లాలోని 4 మునిసిపాలిటీలకు కావలసిన మొక్కల వివరాల నివేదికలను సంబంధింత అధికారులు రెండు రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు.     గ్రామపంచాయతీ పరిధిలోగల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు గోడలపైన మంచి మంచి కొటేషన్స్, బొమ్మలు వేయించాలని సూచించారు. గ్రామా పంచాయతీ కార్యదర్శులు ఇది నా ఊరు అని పని  చేస్తే ఏదైనా సాధ్యపడుతుందని ఆమె అన్నారు. హరితహారం కింద చేపడుతున్న పనులను అటవీ శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో గల 566 నర్సరీలను సందర్శించే ముందు రోజు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించాలని అటవీ శాఖాధికారులను ఆదేశించారు. నర్సరీ ఇంచార్జి అధికారుల జాబితాలను గ్రామపంచాయతీలకు పంపాలని, అధికారి పేరును పంచాయితీ బోర్డులో ప్రదర్శించాలని తెలిపారు. మొక్కల సంరక్షణ కొరకు ఏర్పాటు చేసిన జాలీలు విరిగిపోవడం, కింద పడిపోవడం జరిగాయని వాటిని ఎప్పటికప్పు సరిచేసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కువ స్థలం ఉంటే  యుకాలాస్ మొక్కలు నాటినట్లు అయితే గ్రామపంచాయతీకి ఆదాయం చేకూరుతుందని వీటికి స్థలాలను గుర్తిచాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పుట్టినరోజు సందర్బంగా ప్రతి ఒకరు ఒక మొక్క నాటాలని లేదా మొక్కను దత్తత తీసుకునేలా అదేవిదంగా అట్టి మొక్కకు పిల్లల పేర్లు పెట్టె విదంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మనసుపెట్టి మనస్ఫూర్తిగా పనిచేస్తే సమాజానికి మంచి పని చేసినవారు అవుతారని ఆమె అన్నారు. హరితహారంలో భాగంగా లక్ష్యాలను అధిగమించి బాగా పనిచేసినవారిని ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఎంపిక చేసి అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డీవో కృష్ణన్, జడ్పి సీఇఓ జానకి రెడ్డి, జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్, జిల్లా పంచాయతీ అధికారి మల్లా రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్  విమల, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, ఏపీవో లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.