ఆలంపల్లి చాకలి గడ్డను చాకలి సామాజిక వర్గానికి కేటాయించాలి

Published: Thursday December 22, 2022
 ఆలంపల్లి చాకలి సామాజిక వర్గ సభ్యులు
వికారాబాద్ బ్యూరో 21 డిసెంబర్ ప్రజా పాలన : మా జీవనోపాధి ఆలంపల్లి చాకలి గడ్డతో ముడిపడి ఉందని ఆలంపల్లి చాకలి సామాజిక వర్గ సభ్యులు బి. ప్రభు, నరేందర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో గల ఆర్డిఓ కార్యాలయం అధికారిణి విజయ కుమారికి ఆలంపల్లి చాకలిగడ్డను చాకలి సామాజిక వర్గానికే కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత ముత్తాతల నుండి ఆలంపల్లి లో గల సర్వే నంబర్ 107 లోని 6 ఎకరాల 15 గుంటల భూమి చాకలి సామాజిక వర్గానికి కేటాయించారని స్పష్టం చేశారు. చాకలిగడ్డ ప్రాంతంలో నీటి వసతి పుష్కలంగా ఉతికిన బట్టలను అరవేయుటకు విశాల స్థలము ఉండడంతో మాకు కేటాయించారని గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాల క్రితం స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ ప్లాంట్ ప్రారంభించుటకు వికారాబాద్ మునిసిపల్ అధికారులు మాకు కేటాయించిన భూమిలో పనులు ప్రారంభించారని వెల్లడించారు. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు చాకలి సామాజిక వర్గానికి కేటాయించిన భూమిని ఆక్రమించి చాకలి సామాజిక వర్గ సభ్యుల రాకపోకలు కొనసాగించేందుకు నిషేధించారు. ఆలంపల్లి చాకలి గడ్డలో చాకలి సామాజిక వర్గం కులదైవం మడేలయ్య దేవస్థానం ఉన్నదని చెప్పారు. ప్రతి సంవత్సరం మడేలయ్య దేవస్థానంలో జనవరి మాసంలో జాతర చేయడం మా ఆనవాయితీగా మారిందని తెలిపారు. సంబంధిత అధికారులు మా కులదైవం మడేలయ్య జాతర నిర్వహించుటకు అనుమతించక పోగా మమ్మల్ని ఇక్కడికి రావద్దని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కేటాయించిన భూమిని మాకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి వసతి ఉతికిన బట్టలను ఆరేసుకోవడానికి విశాలమైన స్థలం ఉన్న ప్రాంతాన్ని మరోచోట చూపాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో పాండు సురేష్ పద్మ వరలక్ష్మి అనసూయ అనిత అశోక్ నాగేష్ నాగమణి అంతమ్మ బాలమణి జ్యోతి కృష్ణవేణి భారతమ్మ లక్ష్మి తదితర చాకలి సామాజిక వర్గం సభ్యులు ఉన్నారు.