సమాజ మార్పుకు మార్గదర్శకుడు మహాత్మా బసవేశ్వరుడు

Published: Wednesday May 04, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 03 మే ప్రజాపాలన : సమాజ మార్పుకు మార్గదర్శకుడు మహాత్మా బసవేశ్వరుడని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. మంగళవారం బసవేశ్వరుని 889వ జయంతి సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పి చౌరస్తా సమీపంలోని మహాత్మా బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా సమాజాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని, కులమతాలు, మనుషుల మధ్య సామరస్యం ఉండాలని ఆకాంక్షించిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని అన్నారు. నేటి పార్లమెంటరీ వ్యవస్థకు ప్రతీకగా నిలిచే అనుభవ మండపాన్ని ఆనాడే స్థాపించి కుల, మత, జాతి, వర్గ, వర్ణ బేధాలు లేకుండా అందరికీ అవకాశం కల్పించారన్నారు. బసవేశ్వరుడి ప్రవచనాల గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.