శాస్త్రీయ పశుపోషణ, ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Saturday October 29, 2022

ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 28 (ప్రజాపాలన, ప్రతినిధి) : పశువుల ఆరోగ్య పరిరక్షణ, శాస్త్రీయ పోషణ పద్ధతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పాడి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో పశు వైద్య, సంవర్ధక శాఖ సంచాలకులు సురేష్ తో కలిసి పాడి పశువులలో "ముద్ద చర్మ వ్యాధిపై" అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పశు పోషణ పై పాడి రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, పశువులలో ముద్ద చర్మ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆవులు, గేదె జాతిలో సూక్ష్మ క్రిమి, కీటకాల ద్వారా వ్యాప్తి చెందే ముద్ధ చర్మవ్యాధి చూపినప్పుడు 2, 3, రోజులపాటు జ్వరం ఉంటుందని, శరీరంపై 2 నుండి 5 సెంటీమీటర్లు గుండ్రంగా కురుపులు వస్తాయని, కాళ్లు వాపు వచ్చే  అవకాశం ఉంటుందని, పాల ఉత్పత్తిలో తగ్గుదల ఉంటుందని తెలిపారు. పశువులను 15 రోజులపాటు క్యారంటైం చేయాలని, జిమి కీటకాలు అభివృద్ధి చెందకుండా మందులు పిచికారి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.