గోకఫసల్వాద్ విద్యార్థికి జాతీయ స్థాయి ప్రాజెక్టులలో మూడవ స్థానం : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Thursday September 23, 2021
వికారాబాద్ బ్యూరో 22 సెప్టెంబర్ ప్రజాపాలన : ఇన్స్ పెయిర్ 2020-21 విద్యా సంవత్సరములో జరిపిన పోటీలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి డి.అశోక్ ను ఘనంగా సన్మానించామని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. దేశవ్యాప్తంగా నిలిచిన 60 ఉత్తమ ప్రాజెక్టులలో జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచిన విద్యార్థిని అభినందించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్వాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధి డి.అశోక్ ను జిల్లా కలెక్టర్ నిఖిల బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అభినందన సత్కారాలు అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్ధి తయారు చేసిన సీలింగ్ ఫ్యాన్ లిఫ్టింగ్ టూల్ గురించి విద్యార్ధితో అడిగి తెలుసుకొని అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్ధి జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు తెవడం ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విద్యార్థి అశోక్ కు ల్యాప్ టాప్ అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మునుముందు కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకొవాలని ఆకాంక్షించారు. 2020-21 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల 92 వేల మంది విద్యార్థులు తమ నూతన ఆలోచనలను అప్లోడ్ చేయగా, అందులోనుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో వడపోయగా 512 ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక చేయడం జరిగిందని, వారిలో నుంచి జాతీయ స్థాయిలో టాప్ 60 మందిని ఎంపిక చేయగా, అందులో నుంచి టాప్ 3వ స్థానంలో వికారాబాద్ విద్యార్ధి నిలిచాడని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుక దేవిని ప్రత్యేకంగా అభినందించారు. అభినందన కార్యక్రమంలో విద్యార్ధికి మార్గదర్శనం చేసిన గైడ్ టీచర్ శాంత్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమప్పను, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్ ను కలెక్టర్ శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకదేవి, సెక్టోరియల్ అధికారి రవి తదితరులు పాల్గొన్నారు.