అక్టోబర్ 9న దళిత బంధు కై చలో హైదరాబాద్

Published: Thursday October 07, 2021

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని, దళిత బంధు ను రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 9న కెవిపిఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జరుగు దళితుల మహాధర్నాను జయప్రదం చేయాలని కెవిపిఎస్ కర పత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా బోడ సామేలు మాట్లాడుతూ దళితులు, గిరిజనులపై రాష్ట్రంలో అనేకచోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరని, దళితులకు అన్యాయం జరిగితే తమ గోడు చెప్పుకోవడానికి ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ లేక తలలేని మొండెం లాగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు పథకాన్ని అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎస్సి కార్పొరేషన్ రుణాలు అందించాలన్నారు. పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నారని వారు విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత వాడలను అభివృద్ధి చేసేందుకు నిర్ధిష్టంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 9వ తేదీన జరుగు మహాధర్నాలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ కరత్, శంకర్, రాజు, విజయ్, గిరి తదితరులు పాల్గొన్నారు.