పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday September 14, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 13, ప్రజాపాలన :
 
పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి అవగాహన ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి విజిలెన్స్ ,  మానిటరింగ్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డి.సి.పి. అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి ఎస్.సి., ఎస్.టి., అట్రాసిటీపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. చట్టంపై ప్రజల్లో పూర్థి స్థాయి అవగాహన కల్పించాలని, ఎస్.సి., ఎస్.టి. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగ పర్చుకోవాలని, బాధితులకు న్యాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 362 కేసులలో బాధితులకు పరిహారం అందించడం జరుగుతుందని, 32 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని. తెలిపారు. గ్రామాలలో సివిల్ రైట్స్ డే సందర్భంగా నిర్వహించే సభలలో పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, అటవీ, ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యేలా చూడాలని, రాజస్వ మండల అధికారి ఈ మేరకు పర్యవేక్షించాలని తెలిపారు. ఆయా మండలాల తహశిల్దార్ల సమన్వయంతో గ్రామసభల వివరాలు అందిరికీ తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని, ఎస్.సి. కాలనీ వాడలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. త్రైమాసికంలో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు వేదికలకు సంబంధించిన వివరాలు కమిటీ సభ్యులకు, నాయకులకు తెలియజేయాలని అన్నారు. నమోదైన కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుపాలని, తప్పుడు కేసులు నమోదు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలోని కేసుల స్థితిగతులను పరిశీలించి తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి, ఎ.సి.పి. తిరుపతిరెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, మున్సిపల్ కమీషనర్లు, శ్యామలాదేవి, కమిటీ సభ్యులు జిల్లపెల్లి వెంకటేష్, బచ్చల అంజయ్య, రేగుంట లింగయ్య సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
Attachments area