వాంకిడి డిప్యూటీ తాసిల్దార్ ను బదిలీ చేయాలి ** తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కోవ విజయ్ **

Published: Tuesday October 04, 2022
ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 03 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని వాంకిడి మండలంలో డిప్యూటీ తహసీల్దారుగా లంబాడ తేగకు  నియమించడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పూర్తిగా వ్యతిరేకిస్తోందని, వెంటనే లంబాడా తెగకు చెందిన డిప్యూటీ తాసిల్దార్ను బదిలీ చేయాలని తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం తుడుందెబ్బ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ ను బదిలీ చేసి, వేరే వారిని నియమించాలని  కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాంకిడి మండల తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి అక్రమంగా వలసలు వచ్చి ఇక్కడ ఎస్టీలుగా అక్రమంగా ఎస్టి ధ్రువపత్రాలు తీసుకుంటున్నారని, అలాంటి లంబాడ తెగ కు చెందినవారిని నియమించడంతో ఆదివాసీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే లంబాడా తెగకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ను  బదిలీ చేసి వేరే వారిని నియమించాలన్నారు. లేదంటే తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉదృతం చేస్తామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తుడుందెబ్బ వాంకిడి మండల  నాయకులు కనక ప్రకాష్, మారుతి, రాము సాయినాథ్, భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.