హరివిల్లుకు దారి మాయదారి

Published: Thursday October 20, 2022

వికారాబాద్ బ్యూరో 19 అక్టోబర్ ప్రజాపాలన : గత కొన్ని సంవత్సరాలుగా హరివిల్లుకు దారి రెండు గేట్ల నుండి పర్యాటకులు రాకపోకలు కొనసాగించే వారు. వారాంతపు శనివారం ఆదివారం రెండు రోజులు  పర్యాటకులతో హరివిల్లు నిత్యకళ్యాణం పచ్చతోరణంలా విలసిల్లేది. హరివిల్లుకు రాకపోకలు కొనసాగించేందుకు అటవీ ప్రాంతం దారినే ఉపయోగించే వారు. గత  జిల్లా అటవీ శాఖ అధికారులు ఎవరు వచ్చినా పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదు. చూసీ చూడనట్లుగా జిల్లా అటవీశాఖ అధికారులు వ్యవహరించేవారు. కానీ ఎప్పటికీ ఒకేలా ఉండే జిల్లా అటవీశాఖ అధికారులు ఉండరు. విధులే పరమావధిగా భావించే జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహించే అధికారి వచ్చినప్పుడు సిబ్బంది, అటవీ ప్రాంత భూములు ఉపయోగించుకునే వారంతా తస్మాత్ జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. జిల్లా అటవీశాఖ అధికారిగా వెంకటేశ్వర్ రెడ్డి ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి అటవీశాఖ ప్రాంత భూములు ఉపయోగించుకునే వారందరి వెన్నులో వణుకు పుడుతుంది. అటవీశాఖ ప్రాంత భూముల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా అధికారి కొరడా ఝలిపిస్తున్నారు. అందులో భాగంగానే హరివిల్లుకు పర్యాటకులు రాకపోకలు కొనసాగించే రెండు గేట్లలో ఒక గేటు దారి ముందు భాగంలో కాలువ తవ్వించారు. ఇంత వరకు బాగున్నా మరొక గేటు ముందు కాలువ ఎందుకు తవ్వించలేదో పలు అనుమానాలకు నెలవైంది. జిల్లా బాస్ ఆదేశించిన కూడా సిబ్బంది కావాలని తవ్వించలేదా ? లేక సిబ్బందే తమ స్వంత నిర్ణయం తీసుకుని మరో గేటు ముందు కాలువ తవ్వలేదా అని అనుమానం వ్యక్తమవుతుంది. జిల్లా అటవీశాఖ అధికారి వెంటనే స్పందించి తగు విచారణ జరిపి అటవీశాఖ ప్రాంత భూములను పరిరక్షించాలని కోరుకుందాం.