ధరణి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Published: Tuesday April 12, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజాపాలన : ధరణి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన  ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 128 మంది నుండి  కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను క్షున్నం గాపరిశీలించి వారం లోపు పరిష్కరించాలని తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ సంబంధించిన సమస్యలు పెండింగ్ లో లేకుండా పని చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికై రెవెన్యూ డివిజన్ అధికారులు మండల స్థాయిలో అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమస్యల పురోగతిపై డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు.  ప్రతి సోమవారం తాండూరు డివిజన్ అదేవిధంగా మంగళవారం వికారాబాద్ డివిజన్ కు సంబంధించి  సమస్యల సత్వర పరిష్కారానికై సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
తాండూరు రెవెన్యూ డివిజన్ :
సమస్యల పరిష్కారానికై ఏప్రిల్ 12 పెద్దముల్,  13 దౌల్తాబాద్ ,  16 తాండూర్,  19 బషీరాబాద్,  20 కొడంగల్ , 21 బొమ్మరాస్ పేట్,  22 యాలాల్ మండలాల్లో తాండూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పర్యవేక్షణలో సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ డివిజన్ లో 12న పూడూరు, 13 పరిగి, 16 మోమిన్ పేట్, 19 నవాబ్ పేట్, 20 దోమ, 21 కోట్ పల్లి, 22 కుల్కచర్ల, 23 చౌడాపూర్, 26 ధారూర్, 27 మర్పల్లి, 28 వికారాబాద్ మండలాలలో వికారాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వికారాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి విజయ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రామిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి హరిత, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.