బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి

Published: Monday April 11, 2022
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్
వికారాబాద్ బ్యూరో 10 ఏప్రిల్ ప్రజా పాలన : బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 శాతం బీసీలు ఉన్నా రాజకీయ ప్రాధాన్యత లేదని విచారం వ్యక్తం చేశారు. బీసీలను అగ్రవర్ణాలు ఓటు బ్యాంకుగా భావిస్తున్నారు తప్ప వారికి రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. 2014 నుండి బీసీలకు రుణాలు ఫీజు రియంబర్స్మెంట్ రావడంలేదని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో బిసి భవన నిర్మాణం కొరకు టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విడ్డూరమని అన్నారు. ఎన్నేపల్లి చౌరస్తాలో జ్యోతి రావు పూలే విగ్రహం స్థాపిస్తామని టిఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో హామీలు ఇచ్చినా నేటికీ అమలు కాలేదని దెప్పిపొడిచారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత బీసీలకు ఇవ్వడం లేదని విమర్శించారు. బీసీల అనైక్యతను సొమ్ము చేసుకొని లబ్ధి పొందుతున్నారని, బీసీలంతా ఐకమత్యంతో వుండి రాజకీయ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు పోరాడాలని హితవు పలికారు. రాష్ట్ర సాధనలో ఎక్కువ మంది బీసీ యువకులే ఆత్మబలిదానం చేసుకున్నారని వెల్లడించారు. బీసీలకు రుణాల మంజూరుకు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్ పెండింగ్లో పెట్టడంలో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చినప్పుడు 60 వేల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రం నేడు నాలుగు లక్షల కోట్లకు అప్పు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని దెప్పిపొడిచారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ యాదవ్ సయ్యద్ సుకూర్ అవుటి రాజశేఖర్ ఉండే కార్ సత్యనారాయణ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.