సాగర్ నీళ్లు లేక ఎండిపోతున్న మొక్క జొన్న పంటలు జిల్లా మంత్రి, చైర్మన్ నిర్లక్ష్యంతో పాలేరు

Published: Wednesday March 01, 2023

బోనకల్, ఫిబ్రవరి 28 ప్రజా పాలన ప్రతినిధి: సాగర నీళ్ల సమస్యతో వందల ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఎండిపోతుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు అన్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల ముందు విన్నవించిన నీటి సమస్య ఏమాత్రం తీర్చడం లేదని, వారిని అడిగితే అంటి ముట్టని సమాధానాలు చెప్తున్నారని మండల కేంద్రంలోని మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.మండల పరిధిలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు కింద సుమారుగా 35 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు సాగు చేయడం జరిగింది. సాగు చేసిన నాటినుండి ప్రస్తుతం వరకు మండల రైతన్నలు నీటి కోసం రోడ్డు ఎక్కని రోజు లేదనీ, అడగని అధికారి లేడనీ అయినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదనీ, బిబిసి కి 1365 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా ప్రతిసారి కేవలం 800 క్యూసెక్కుల అరకొర నీటిని విడుదల చేస్తూన్నారని అన్నారు. జిల్లాలో బాధ్యతమైన పదవిలో ఉన్న మంత్రి,చైర్మన్లు రైతు సమస్యలను గాలికి వదిలేసి వారి ప్రచార ఆర్బాటాలకు సమయం కేటాయిస్తున్నారే తప్ప ఏనాడు రైతు సమస్యలనూ,నీటి సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవని వారు మండిపడ్డారు.పాలేరు జలాశయం అడుగంటుతుంటే కనీసం సోయ లేకుండా ఉండటం ఏమిటని వాళ్లు ప్రశ్నించారు.వారబంది ముగిసి 26వ తేదీన విడుదల కావలసిన నీళ్లు మూడు రోజులుగా జాప్యం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వారబంది మీద రెండు మూడు రోజులు అదనంగా రైతులకు పంపిణీ చేసి వారిని ఆదుకోవాలని లేకపోతే రైతు నష్టపోయి అప్పులకోరికి పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు నల్లమోతు సత్యనారాయణ,కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు,సర్పంచులు ఎర్రంశెట్టి సుబ్బారావు, ములకారపు రవి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా భద్రు నాయక్ వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.