తాగునీటి కష్టాలు తీర్చిన మదార్ సాహెబ్..

Published: Wednesday May 11, 2022
తల్లాడ, మే 10 (ప్రజాపాలన న్యూస్): నాయకుడంటే జనంతో ఉండాలి, జనం కోసం ఉండాలి, జనంలో ఉండాలి.. అప్పుడే వాళ్ళ సాధక బాధకాలు తెలుస్తాయి. గద్దెమీద కూర్చొని సుద్దులు చెప్పే నాయకులు, మాయ మాటలు చెప్పే నేతలు ఉన్న ఈ రోజుల్లో జనం కోసం పోరాడే నాయకుడు దొరకటం మా అదృష్టం అంటున్నారు అక్కడి ప్రజలు.. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో జంగాల కాలనీలో ప్రజలు మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నారని తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు మదార్ సాహెబ్ కాలనీకి వచ్చి ప్రజలను కలిశాడు. వాళ్ళు పడుతున్న బాధలు కళ్లారా చూశాడు... చలించిపోయాడు, కాలనీ వాసులు పడుతున్న అవస్థలను ప్రజా ప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక ఎమ్మెల్యే వెంకట వీరయ్య దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఎంపిడివోతో మాట్లాడి, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే యంత్రాంగం కదిలివచ్చింది. తక్షణమే వాటర్ టాంకర్ తో మంచినీళ్లు సరఫరా చేశారు. మంచినీటి కొరతకు శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు. అప్పటివరకు టాంకర్ ద్వారా నీళ్లు సరఫరా చేయనున్నట్టు ఎంపిడిఓ రవీందర్ రెడ్డి తెలిపారు.తమ సమస్యల పట్ల స్పందించి పరిష్కారానికి చొరవ చూపిన మదార్ సాహెబ్ మంచితనానికి జంగాల కాలనీ వాసులు జేజేలు పలుకుతున్నారు.