కొత్త తండాకు కాలినడకన వెళ్లిన ఎమ్మెల్యే

Published: Friday April 09, 2021
* ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
* ధారూర్ మండలంలోని తండావాసుల జీవన్మరణ సమస్యలు
వి కడప జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 ( ప్రజాపాలన ) : ముందలి తండాలోని మురికి నీటి సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ బాబ్యా నాయక్ కు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. గురువారం ధారూర్ మండల పరిధిలోని మైలారం గ్రామం అనుబంధ గ్రామాలు ముందలి తండా, వెనకాల తండా, కొత్త తండాలలో గ్రామ సర్పంచ్ బాబ్యా నాయక్ సమక్షంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వీధి వీధి విస్తృతంగా తిరిగి సమస్యల పుట్టను తెలుసుకున్నారు. ``మీతో నేను`` కార్యక్రమంలో భాగంగా ఉదయం 06:30 గంటల నుండి వికారాబాద్ నియోజకవర్గం ధారూర్ మండలంలోని కాలినడకన వెళ్తూ సమస్యల తోరణాన్ని తెలుసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోకు సూచించారు. ముందలి తండాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె లేకపోవటంతో ప్రమాదాలకు హేతువవుతుందని హెచ్చరించారు. పెన్షన్  రేషన్ కార్డుల లబ్ధిదారుల వేలిముద్రలు పనిచేయని సమయంలో సంబంధిత అధికారులు గ్రామస్తులకు ఇబ్బంది  లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపిఎం సురేష్ గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గత 30 సంవత్సరాల క్రితం నుండి కొత్త తండా ఒకటి ఉన్నదనే విషయాన్ని ప్రజా ప్రతినిధులు మరిచినట్టున్నారని విచారం వ్యక్తం చేశారు. కొత్త తండా వాసులకు రోడ్డు వ్యవస్థ నేటికీ లేకపోవడంతో జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు. అటవీ శాఖ వారు రోడ్డు వేయనివ్వరు. రోగం వచ్చినా నొప్పొచ్చినా అటవీ శాఖ వారి చక్రబంధంలో బందీలుగా మగ్గాల్సిందే. గర్భిణీలను, తీవ్రస్థాయిలో జబ్బు చేసిన వారిని ఆసుపత్రికి తరలించాలంటే అటవీ శాఖ వారి చక్రబంధాన్ని కాలినడకతోనే గమ్యానికి చేరవలసి ఉంటుంది. ఇంత వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా కొత్త తండాను సందర్శించిన దాఖలాలు లేవని తండా వాసులు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు తమ గోస వినిపించారు. స్పందించిన ఎమ్మెల్యే కొత్త తండాకు రోడ్డు వేయిస్తానని హామీ ఇవ్వడంతో ఉపశమనం పొందారు. ధారూర్ మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో లబ్ధిదారులకు మంజూరైన 12 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు 36 కళ్యాణ లక్ష్మీ  షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీజాత, పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాములు, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ రాజు గుప్త, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజు నాయక్, రైతుబంధు అధ్యక్షుడు రామ్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు వీరేశం, ప్రధాన కార్యదర్శి యూనుస్, సర్పంచ్ చంద్రమౌళి దేవేందర్ నాయక్ ఇతర సర్పంచులు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, అన్ని శాఖల మండల స్థాయి ప్రభుత్వ అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.