అంబేద్కర్ ఆలోచనలే రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు స్ఫూర్తి - టీఎస్ హెచ్ డీసీ చైర్మెన్ చింతప్రభాక

Published: Saturday April 15, 2023
సంగారెడ్డి, ప్రజాపాలన ప్రతినిధి:
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ ఆలోచనలే.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు స్ఫూర్తి అని టీఎస్ హెచ్ డిసి చైర్మన్ చింతప్రభాకర్ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకంగా పథకాలు రూపొందిస్తూ, సామాజిక న్యాయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు.
 
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కంకణ బద్దులు కావాలి......... జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, అడిషనల్ ఎస్పీ వాణి విశ్వనాథ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి,  ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన సభలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని, వివక్షత లేని సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అని  కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ  ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. అంబేద్కర్ జయంతి అయిన నేడు  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందరూ అంబేద్కర్ మార్గాన్ని ఆచరించాలని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఉద్భోదించారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల, ప్రజాసంఘాల  ప్రతినిధులు ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, టిఎస్ఎస్ కళాకారులు ఆలపించిన పాటలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి జగదీష్, అధికారులు, వివిధ కుల సంఘాల, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.