వికారాబాద్ ప్రాంత సమస్యలను పరిష్కరించండి

Published: Saturday February 11, 2023
* నర్సింగ్ కళాశాల, టూరిజం ఆవశ్యకత
* స్టేడియంల నిర్మాణాలు చేపట్టాలి
* ఆర్ అండ్ బి రోడ్ల దుస్థితి మారాలి
* లింగ వివక్ష మార్చేందుకే కళ్యాణ లక్ష్మి
* ఆడపిల్ల పుడితే భార్యను తన్ని తరిమేసే దుర్నీతి మారాలి
* అసెంబ్లీ సభా సాక్షిగా సమస్యల చిట్టాను సభ ముందుంచిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 10 ఫిబ్రవరి ప్రజాపాలన : ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సమయం సందర్భాన్ని తప్పక వినియోగించుకోవాలి. సమస్యలను మళ్లీమళ్లీ అధినాయకత్వం దృష్టికి తీసుకురాగలగాలి. అప్పుడే రాజకీయ నాయకుని పరిపక్వత వ్యక్తం అవుతుంది. రాజకీయ నాయకునిగా ఎదగడానికి ప్రజా సమస్యలను అసెంబ్లీ సమావేశాలలో అందరి దృష్టికి తెస్తే అందరి దృష్టి ఆ సమస్యలపై పడుతుంది. అధినాయకత్వం ఆ ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా సహకారం అందిస్తారని చిన్న ఆశ. ఆ ఖోవలోనే వ్యక్తే వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. గురువారం జరిగిన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమావేశాలలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వికారాబాద్ ప్రాంత సమస్యల పుట్ట చిట్టాను ఒక్కొక్కటిగా శాసన సభాధ్యక్షుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా సభ ముందు పెట్టారు. ఒకవైపు అధినాయకత్వాన్ని మెచ్చుకుంటూ మరోవైపు సమస్యల చిట్టాను సవినయంగా శాసన సభలో ప్రస్తావించారు. వికారాబాదును జిల్లాగా ప్రకటించినందుకు, వికారాబాద్ ప్రాంతానికి మెడికల్ కళాశాల ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు సంబంధిత మంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ను కోరేది ఏమంటే వికారాబాద్ ప్రాంతానికి నర్సింగ్ కళాశాల అలాగే ప్రముఖ దేవస్థానం శ్రీ అనంతపద్మనాభ దేవాలయం ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాదుకు గతంలోనే స్టేడియం మంజూరైనప్పటికీ దానిని ఇంతవరకు పురోగతి సాధించకపోవడం విచారకరం. మర్పల్లిలో మినీ స్టేడియం ఏర్పాటు కొరకు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. మర్పల్లి పట్టణంలో ఆర్ అండ్ బి రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వివరించారు. వికారాబాద్ లో విద్యుత్ సమస్యలు వర్ణనాతీతమని ప్రస్తావించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 33 కెవి సబ్ స్టేషన్ ను మోమిన్పేట్ బంట్వారం మధ్య ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బి రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధారూర్ మండల కేంద్రంలో రోడ్డును సెంట్రలైజ్ చేసి డివైడర్లు నిర్మించాలని సూచించారు. బార్వాద్, మాల సోమవారం మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. మోమిన్ పెట్ మండల పరిధిలోని టేకులపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. వికారాబాద్ నుండి గోధంగూడ, గోధంగూడ నుండి నాగారం వరకు. వికారాబాద్ నుండి మైలార్ దేవరంపల్లి, మైలార్ దేవరంపల్లి నుండి జిన్నారం వరకు గల రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని సూచించారు. 
* లింగ వివక్ష మార్చేందుకే కళ్యాణ లక్ష్మి : 
కెసిఆర్ కిట్ లక్ష్యం ప్రతి ఇంట ఆడపిల్ల పుడితే ఆ కుటుంబానికి 13వేల రూపాయలు బిఆర్ఎస్ ప్రభుత్వం అందించడం అభినందనీయం అని ప్రశంసించారు. లింగ వివక్షను మార్చేందుకే సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని శాసనసభ సాక్షిగా గుర్తు చేశారు. రెండవసారి ఆడపిల్ల పుడితే భార్యను తన్ని తరిమేసే భర్త, మూడవసారి ఆడపిల్ల పుట్టిందని ఇంటి నుండి భార్యను గెంటేసిన భర్త అనే మాటలను తరచుగా వింటామని అన్నారు. ఆడపిల్ల పుట్టడానికి ప్రధాన కారకులు ఎవరని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాను ఒక వైద్యునిగా సైన్స్ ప్రకారం ఆడపిల్ల పుట్టడానికి గల ఒక వివరణ ఇచ్చారు. మగవారిలో ఎక్స్, ఎక్స్ క్రోమోజోములు, ఆడవారిలో ఎక్స్, వై క్రోమోజోములు ఉంటాయన్నారు. ఎక్స్, ఎక్స్ క్రోమోజోములు ఫలదీకరణం చెందితే ఆడపిల్ల పుడుతుంది. ఎక్స్, వై క్రోమోజోములు ఫలదీకరణం చెందితే మగ పిల్లవాడు పుడతాడని సభా సాక్షిగా సంపూర్ణ వివరణ ఇచ్చారు. ఇంటి నుండి తన్ని తరిమేయాల్సింది భార్యనా...? భర్తనా...? అని ఎమ్మెల్యే ఆనంద్ ప్రశ్నించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాను అడిగిన ప్రశ్నల పరంపర అనంతరం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేశాం తెలంగాణ శుభమస్తు నిత్యం భారత సమస్త సుఖినోభవంతు జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్ నినాదంతో ముగించారు.