పేపర్ లీకేజీలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భీమ్ భరత్ ఆగ్రహం* *పేపర్ లీకేజీల విద్యార్థుల పాల

Published: Wednesday April 05, 2023

చేవెళ్ల ఏప్రిల్ 4, (ప్రజాపాలన ):-

తెలంగాణలో పేపర్ లీకేజీలు  విద్యార్థుల పాలిట శాపంగా మారిందని   టీపీసీసీ  ప్రధాన కార్యదర్శి భీమ్ భరత్  అన్నారు.
తెలంగాణలో విద్యార్థిగా, ఉద్యోగార్ధిగా బతకడమంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందన్నారు. రాష్ట్ర పాలకుల బాధ్యతారాహిత్యం వల్ల మొన్నటికి మొన్న ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్షలు పెట్టే టీఎస్‌పీఎస్‌సి ప్రశ్నాపత్రాలు లీకవగా... ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం, ఈ రోజున హిందీ పేపర్ లీకయ్యాయని అన్నారు. ఎక్కడా కట్టుదిట్టమైన చర్యలు లేవని.. భద్రతా వ్యవస్థలు లేవని.. సరైన పద్ధతులు లేవని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలంటే ప్రభుత్వానికి ఒక ఆటగా మారిపోయిందని కాంగ్రెస్ నేత మండిపడ్డారు.

నిరాశతో బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ఈ సర్కారు ఏ మాత్రం పట్టింపులేని తీరును ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇదిలా ఉంటే మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశాన్ని కూడా సర్కారు అటకెక్కించిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడాది గడిచినా కదలిక లేని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది పాతిక, ముప్ఫైయ్యేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని రెగ్యులరైజేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని తెలిపారు. వీరు రిటైర్ అయ్యేలోగానైనా రెగ్యులరైజ్ అవుతారో లేదో ఆ దేవుడికే ఎరుక అని... వీలైనంత మందిని రిటైర్ చేయించి... తక్కువలో తక్కువ మందికి మాత్రమే ఆర్ధిక ప్రయోజనాలు కల్పించి డబ్బులు మిగుల్చుకోవాలనే కుట్ర కోణం కూడా ఇందులో కనిపిస్తోందని భీమ్ భరత్ వ్యాఖ్యలు చేశారు..