*ఇనుప విద్యుత్ స్తంభాల ఇబ్బందులకు పరిష్కారం** -50 ఏళ్ల నాటి ఇనుప విద్యుత్తు స్థంభాల తొలగింపు.*

Published: Tuesday March 07, 2023
చేవెళ్ల  జెడ్పీటిసి మర్పల్లి మాలతి క్రిష్ణారెడ్డి చొరవతో దశాబ్దాలుగా కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులుకు తెరపడింది. గత యాబై ఏళ్ల క్రితం చేవెళ్ల పట్టణంలో ఆయా కాలనీలో అప్పట్లో ఇనుప విద్యుత్తు స్థంభాలు వేయించి ప్రభుత్వం విద్యుత్తు సరఫరా చేయించింది. అయితే కాల క్రమేణ వాటి స్థానంలో సిమెంట్ విద్యుత్తు స్తంభాలను వేస్తున్నారు. కారణం వర్షం కురిసిన సమయంలో, లేదా షాక్ సెర్కూట్ సందర్భంలో విద్యుత్తు షాక్ లు వస్తున్నాయి. దీంతో చేవెళ్ల లోనే గాక ఎక్కడైన ఇనుప విద్యుత్తు స్తంభాలు ఉంటే తీసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే చేవెళ్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లోని ప్రజలు తమ ఇళ్ల ముందు గల విద్యుత్తు స్థంభాల వల్ల వర్షం కురిసిన సమయంలో విద్యుత్తు షాక్ వస్తుందని, ఇనుప స్థంభాలను తొలగించి వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా పలు మార్లు విద్యుత్తు కార్యాలయం చుట్టు తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో కాలనీ వాసులు జడ్పిటిసీ మర్పల్లి మాలతి క్రిష్ణారెడ్డి దృష్ఠికి సమస్యను తీసుకురాగా ఆమే వెంటనే స్పందించారు. ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య ల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరించాలని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య లు సంబంధిత విద్యుత్తు అధికారులను ఆదేశించారు. కేవలం మూడు రోజుల్లో ఇనుప విద్యుత్తు స్తంభాలను తొలగించి నూతన సిమెంట్ విద్యుత్తు స్తంభాలను వేసి విద్యుత్తును ఏదావిదిగా పునరుద్ధరించారు. దీంతో సదరు కాలనీ వాసులు జెడ్పీటిసి మాలతి క్రిష్ణారెడ్డిని అభినందించి, కృతజ్ఞతలు తెలియజేశారు*