సీనియర్ సిటిజన్స్ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

Published: Monday August 22, 2022

మధిర ఆగస్టు 21 సీనియర్ సిటిజన్స్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జడ్జి ధీరజ్ కుమార్ సూచించారు. సీనియర్ సిటిజన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం పెన్షనర్స్ కమ్యూనిటీ హాల్ నందు న్యాయ చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మధిర న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, మరియు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ యొక్క హక్కుల కోసం ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని, పిల్లలు వారి పట్ల వివక్ష చూపినప్పుడు బాధ్యతారహితంగా వ్యవహరించప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి శనివారం లోక్ అదాలత్ సందర్భంగా సమస్యలను వివరిస్తూ వినతిపత్రం ఇచ్చినట్లయితే, ప్రతివాదులని పిలిపించి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని , సీనియర్ సిటిజన్స్ వారి యొక్క హక్కులను తెలుసుకొని, సాధన కోసం కృషి చేసినట్లు అయితే కచ్చితంగా న్యాయం అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షులు పారుపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శి చెన్నంశెట్టి నందయ్య, కామేశ్వరరావు కోర్టు సూపరిండెండెంట్ ఎంవి సత్యనారాయణ, వెంకన్న లీగల్ సెల్ కార్యదర్శి సూర్యనారాయణ న్యాయవాదులు పాల్గొన్నారు.