ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా ప్రజలకు అవగాహన కల్పించాలి

Published: Wednesday August 25, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 24 ఆగస్ట్ ప్రజాపాలన : ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మంగళవారం వికారాబాద్ నియోజక పరిధిలో గల మర్పల్లి మండలానికి చెందిన కల్ఖోడా గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శివకుమార్, ఉపసర్పంచ్ జమీర్ లతో కలిసి మీతో నేను కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై పలు చోట్ల మిషన్ భగీరథ పైపులు లీకేజీ కావడంతో త్రాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందని, వెంటనే మరమ్మత్తులు చేసి నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. పలు చోట్ల శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ళను, అంగన్ వాడీ భవనాన్ని  కూల్చివేయాలన్నారు. పై కప్పులు లేకుండా ప్రమాదకరంగా ఉన్న బావుల పై జాలి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పశువులు నీరు త్రాగటానికి ఏర్పాటు చేసిన తొట్టిని శుభ్రపరచాలన్నారు. గ్రామంలో చాలా మంది మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయిన ఉపయోగించకుండా బహిర్భూమికి వెళ్ళటం వలన గ్రామ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొని జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు అధికారులు పరస్పర సహకారంతో మరుగుదొడ్లు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న పెంట కుప్పలను తొలగించాలన్నారు. గ్రామంలో పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు సరి చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న స్థంభాలను వెంటనే తొలగించాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఈని ఆదేశించారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వెంటనే సర్వే చేసి కంచె ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇంకుడు గుంతల ఏర్పాటు పై అవగాహన కల్పించాలని, గతంలో నిర్మించిన ఇంకుడు గుంతల బిల్లులకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
జాబ్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే : నియోజకవర్గం మర్పల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన (మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్) జాబ్ కార్డులను సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, ఎంపిటిసి శ్రీవిద్య వెంకటయ్య, ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.