అధికార పార్టీ కౌన్సిలర్ భర్త ఆగడాల నుండి కాపాడండి ఒంటరి మహిళల ఆవేదన

Published: Saturday December 24, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి పట్టణంలోని 16 వ వార్డ్ కౌన్సిలర్, అధికార పార్టీకి చెందిన ఎలిగేటి సుజాత భర్త ఎలిగేటి శ్రీనివాస్ వారి అనుచరుల ఆగడాల నుండి మమ్మల్ని కాపాడాలంటూ అదే బస్తి లో నివాసం ఉంటున్న ఎండి కరిష్మా ఆమె తల్లి షరీఫా ఇద్దరు ఒంటరి మహిళలలు (తల్లి కూతుర్లు) శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలంటూ రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు, పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ బస్తి 16వ వార్డు కౌన్సిలర్ ఎలిగేటి సుజాత ఆమె భర్త శ్రీనివాస్, వారి అనుచరుల ఆగడాలు మా కుటుంబం పై మితిమీరిపోతున్నాయని, తాము ఉంటున్న నివాస స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని, మమ్మల్ని బయటికి పంపించడానికి గత తొమ్మిది నెలలుగా నానా హింసలు పెడుతున్నారని, గతంలో రెండు సార్లు దాడులు చేశారని, అదలా ఉండగా గురువారం నాడు మాపై కత్తులతో, కర్రలతో పలువురు మహిళలు, శ్రీనివాస్ బంధువులు, అనుచరులు ఎలిగేటి లక్ష్మీనారాయణ, మల్లేష్, కట్కూరి శంకర్, గంధం కుమారస్వామి, నవీన్, అనే వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారని తెలిపారు. తాము నివాసముంటున్న  స్థలాన్ని వదిలిపెట్టి వెళ్లకపోతే, చంపేస్తామని లేదా రేప్ చేస్తామని మీకు ఎవరు  అడ్డు వస్తారో చూస్తామని, రాత్రనకా, పగలనకా, బెదిరిస్తున్నారని, మహిళల మని చూడకుండా మా తల్లి ఒంటిపై ఉన్న బట్టలను గురువారం పీకారని బోరున విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో దాడులు చేయగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారని, అయినా తిరిగి దాడులు చేస్తిన్నారని, వెంకటాపూర్ సంఘటన తరహాలో పెట్రోల్ పోసి చంపుతామని, బెదిరిస్తున్నారని వారన్నారు. ఇంట్లో నుండి బయటికి రావాలంటే క్షణ క్షణం భయం భయంగా బ్రతకాల్సి వస్తుందని, మాకు కౌన్సిలర్ ఎలిగేటి సుజాత ఆమె భర్త శ్రీనివాస్ వారి అనుచరులతో ప్రాణం హాని ఉందని, తమను కాపాడాలని అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు.
 
వార్డులో ఖాళీ అయిన సింగరేణి క్వార్టర్లను, ప్రక్కనున్న స్థలాలను ఆక్ర మించిన ఆరోపణలు వారి  ఎన్నో  ఉన్నాయని, ఎదురు తిరిగి అడిగితే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
 బెల్లంపల్లి పట్టణంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో ద్వితీయ శ్రేణి నాయకులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న పట్టించుకోని మున్సిపల్, రెవెన్యూ, అధికారులు అనాధలుగా ఒంటరి మహిళలుగా జీవిస్తున్న వారి స్థలంలో ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరికల బోర్డులు పాతడం ఎంతవరకు సమంజసమని  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి గౌస్, సిపిఐ పార్టీ నాయకులు రత్నం ఐలయ్య, స్వచ్ఛంద సంస్థ నాయకురాలు దాసరి విజయలు, వారి న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలుపుతూ రాస్తారోకో లో పాల్గొని మద్దతు పలికారు.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, తదితర నాయకులు ఎలిగేటి శ్రీనివాస్ దంపతుల వారి అనుచరులపై చర్యలు తీసుకొని, ఆ ఒంటరి మహిళలకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు.