టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్‌చల్ * తన వాహనానికి దారి ఇవ్వలేదని సిబ్బందిపై దాడి * స

Published: Thursday January 05, 2023
 మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా వద్ద అధికార పార్టీకి చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం రాత్రి హల్‌చల్‌ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనానికి దారి ఇవ్వలదేని టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాలు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే టోల్ ప్లాజా సిబ్బందిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి ఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే అధికార దర్పానికి ఈ దాడి ఘటన నిదర్శనమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే అనుచరుల వాదన మరోలా ఉంది. నేషనల్ హైవే పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయడంపై చిన్నయ్య ప్రశ్నించినట్లు చెప్పారు. అంబులెన్స్‌లు, ప్రభుత్వ వాహనాలకు రూట్ క్లియర్ చేయకపోవడంతోనే ఎమ్మెల్యే వారిని నిలదీశారన్నారు. కాగా.. దీనిపై ఎమ్మెల్యే చిన్నయ్య స్పందించాల్సి ఉంది.
 
* టోల్ ప్లాజా అధికారులపై చర్యలకు డిమాండ్.
 
రోడ్డు పనులు పూర్తికాకముందే  టోల్ ప్లాజా ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని
స్థానిక అడ్వకేట్ చేను రవికుమార్
లీగల్ సెల్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మంచిర్యాల నుండి చంద్రాపూర్ వరకు, నిర్మాణం చేస్తున్న నాలుగు వరసల జాతీయ రహదారిపై సోమగూడెం, మందమర్రి, పట్టణాల్లో  రోడ్డు పనులు పూర్తికాలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.  అలాగే టోల్ ప్లాజా నుండి 19 కిలోమీటర్ల పరిధిలోని స్థానికులకు ఉచిత పాసులు జారీ చేయాల్సి ఉండగా, పాసులు జారీ చేయకుండానే టోల్ ప్లాజాను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.  రోడ్లను పూర్తి చేయకుండా వాహనదారుల వద్ద నుండి టోల్ ప్లాజాలో డబ్బులు వసూల్ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, రోడ్లు పూర్తి అయ్యేంతవరకు ఎలాంటి వసూళ్లు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని లీగల్ సెల్ అథారిటీ అధికారులకు  ఫిర్యాదు చేసినట్లు తెలిపారు..