కురుమలు అన్ని రంగాలలో రాణించాలి

Published: Monday November 28, 2022
రాజ్యసభ సభ్యులు ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య
వికారాబాద్ బ్యూరో 27 నవంబర్ ప్రజా పాలన : కురుమలు అన్ని రంగాలలో రాణించాలని రాజ్యసభ సభ్యులు ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్లో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో జిల్లాలోని కురుమ సోదరులందరూ కుటుంబ సమేతంగా భారీ ఎత్తున తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేశారు. జిల్లా కేంద్రంలోని అతిథి గృహము నుండి సత్య భారతి ఫంక్షన్ హాల్ వరకు డప్పు బృందం, కురుమల డోలు వాయిద్యాలతో ప్రేక్షకుల కనురెప్పలు వాల్చని వాయిద్యానికి అనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు. కురుమల డోలు వాయిద్యం భారీ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డోలు వాయిద్య కారులు ప్రత్యేక ఏకరూపు దుస్తులు ధరించి కాళ్లకు గజ్జలు కట్టుకొని వాయిద్యాలకు అనుగుణంగా చిన్నారులు సైతం నృత్య ప్రదర్శనతో పలువురి హృదయాలను ఆకట్టుకున్నారు.  ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కురుమలు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా దూసుకెళ్లాలన్నారు. రాజ్యాంగబద్ధంగా కురుమ కులానికి కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కురుమ కులాన్ని రాజ్యాంగబద్ధంగా బీసీ - బీలో చేర్చి కురుమల అస్తిత్వాన్ని  భారత ప్రభుత్వం గుర్తించిందని గుర్తు చేశారు. కురుమ సమాజానికి రాయితీలు కాదు రాజ్యాధికారం పొందే విధంగా కృషి చేయాలన్నారు. జనాభాలో 56% ఉన్న బీసీ కులాల్లో బిసిబి కురుమ కులానికి చెందినవారు మెజార్టీ వర్గంగా ఉన్నారు. కురుమల హక్కుల సాధనలో అందరం సంఘటితమవుదామని పిలుపునిచ్చారు. రాజకీయంగా అవకాశాలు దక్కించుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన పురుషులు మహిళలు రాజకీయ ప్రతినిధులు వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.